పుట:కాశీమజిలీకథలు-05.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

39

జీవులకు జననముతోనే మరణము కూడుకొనియున్నది. నూఱేండ్లు బ్రతికినను వాంఛలు నశింపవు గదా! మమత్వముడిగి సుఖింపుమని యుపదేశించిన విని యవ్వనితామణి యొకింత ధైర్య మవలంబించి కుమారుని కిట్లనియె. తండ్రీ! దేహాభిమానమున్నంత వఱకు మమత్వము విడుచుట కష్టము. సకల లోకస్తుత్యుఁడవగు నీయట్టివాని విషయమై చెప్పనేల? కానిమ్ము విధిగతి యలంఘ్యముగదా! నీవిఁక గృహమేధివైసుపుత్త్రులంగని కులముద్ధరింపుము. క్రతువులచే దేవతలఁ దృప్తిపరుపుము. నీ తండ్రి గృతకృత్యుం జేయు మిదియే నాకోరిక, యని పలికిన విని నవ్వుచు శంకరుం డిట్లనియె

శ్లో. భ్రమతాంభవవర్త్యభ్రమా
    న్న హికించిత్సుఖమంబలక్షయె
    తదవాప్యచతుర్ధమాశ్రమం
    ప్రయతిష్యెభవ బంధవిముక్తయె.

అమ్మా! భ్రమవలన సంసారమార్గమున గ్రుమ్మరువారికి జననీ జఠరవాస మరణాది రూపమైన దుఃఖమేకాని సుఖమించుకయులేదు. మరియు నల్పాయుసంపన్నుం డగు నేను బెండ్లియాడి భార్యాపుత్త్రాదులఁ గ్లేశ పరుపనేల? కావున నేను జతుర్థాశ్రమమును స్వీకరించి భవబంధవిముక్తికొఱకుఁ బ్రయత్నించెద. ననుజ్ఞయిమ్మని కోరికొనియెను సతీదేవి కర్ణకఠోరములైన యతని మాటలువిని చెవులు మూసుకొని రెట్టించిన శోకముతో గద్గకంఠయై, నాయనా! నీవు నన్ను విలపింపఁజేయుటకా జనించితివి? వల్పాయుష్కుండవని వినినది మొదలు హృదయము పగిలియున్న నన్నోదార్చు రీతి యిదియా? నాకేమిగతిఁ జూపి నీవు సన్యాసిదయ్యెదవు? అయ్యయ్యో? నీవన్న మాట గోరుచుట్టుపై రోకలిపడినట్లున్నదిగదా? ముప్పదియేండ్లలోఁ బెండ్లియాడి సంతానమునుగని క్రతువులఁజేసి కృతకృత్యులైన వారనేకులుగలరు. నీవును బూర్వుల మార్గ మనుసరింపుము. వృద్ధురాలనగు నామాట లాదరింపుమని యనేక ప్రకారముల సానునయముగాఁ బలికిన విని శంకరుండు వెండియు నిట్లనియె.

శా. తల్లీ! పుత్త్రులు శత్రులన్పలుకు వ్యర్ధంబౌనెనీవంత వ
     ర్దిల్లుంగాని సుఖంబెనాకతనఁ జింతింపన్మమత్వంబులోఁ
     ద్రెళ్ళంజేయుము సౌఖ్యమయ్యెడు భవాబ్దిందాటెదోయమ్మ నా
     కిల్లున్వాకిలి ప్రీతిలేదఖిలమున్ హేయంబుగాఁ దోచెడిన్.

అమ్మా! నీవు నాయందు మమకారముఁ బెట్టికొంటివేని దుఃఖమే కాని సుఖము లేశమైననులేదు. నాకీయెంటిజందెమే బరువై యున్నది. రెండవదాని నెట్లు ధరింతును. నాకీ సంసారమందిచ్చలేదు. పారలౌకిక సౌఖ్యంబు విచారించుకొనియెదనని పలికినవిని యామెగోలున నేడ్చుచు నతని గడ్డము పట్టుకొని, నాయనా! నీవు మిక్కిలి యక్కటికము గలవాఁడవు. ఎందరినో రక్షించితివి నాముప్పు గడిపి పిమ్మట నీ