పుట:కాశీమజిలీకథలు-05.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మౌనమే యవలంబించుట యుక్తము. దానఁ గోపించి యింతకంటెఁ గష్టదశ నొందించునేమో! అవును. సందియమేలా! దీనిజాతి క్రూరజాతికాదా? ఇంతకన్నఁ గష్టమగుంగాక? యీ ఛండాలులతోఁ గలసి మాట్లాడుట అనుచితము. కావున మౌనమవలంబించుటయే శ్రేయము 'ఇఁక మాట్లాడదు. ఈ మూకశుకంబు నాకేల' యని యెప్పుడైన విసుగుజెంది విడువవచ్చును. మాట్లాడుచున్న విడువనేరదు.

ఆహా! దివ్యలోకభ్రంశము మర్త్యలోకజన్మము తిర్యగ్యోనిపతనము, ఛండాలహస్తోపగమనము, పంజరబంధదుఃఖము. ఇది యంతయు నింద్రియచాపల్యదోషంబునంగదా! కలిగినది. అక్కటా! ఒక్క వాక్కునే కాదు. సర్వేంద్రియములను నియమించెదనని తలంచుచు మౌనము వహించితిని.

పలికించినను, తర్జించినను, గొట్టినను, బలవంతముగాఁ బొడిచినను నేమియు మాటాడక కేవలము సీత్కారము మాత్రము జేయుచుంటిని.

పానాశనములం దెచ్చి పెట్టినను నేమియు ముట్టక యాదివస ముపవాసమే కావించితిని. ఆ మఱునాఁడును నే నేమియుం దినకున్నంతఁ జింతించుచు నా కాంతామణి స్వయముగా నానావిధములగు ఫలంబులు సురభిశీతలమగు జలంబులు దీసికొని వచ్చి నా కిచ్చినది నే నుపయోగించితికాను. అప్పుడు నన్నుఁ దేరిబారి చూచుచు నా చిన్నది నా కిట్లన్నది.

నిర్వికారచిత్తములు గలిగి క్షుత్పిపాసలచే దీపించు పశువులకును, పక్షులకును సిద్ధమైన యాహార మెట్టిదైనను గుడుచుట ధర్మమైయున్నది. నీ వట్టిదానవుగదా? నీకీ భోజ్యాభోజ్యవివేచన మేమిటికిఁ గలుగవలయును? జాతిస్మృతి గలిగి యస్మదీయంబగు నాహారంబు గుడువకుంటివా? అట్లైనను తిర్యగ్జాతియం దుదయించిన నీ నియమ మవసరములేదు.

అత్యుత్తమమైన తాపసజాతియం దుదయించుటయుఁ దిర్యగ్జాతియందుఁ బుట్టఁదగిన పాపకర్మ గావించితివి గదా? ఇప్పుడు నీ కీవిచార మేటికి? మొదటనే వివేకము గలిగియున్నచో నీ ముప్పు రాకయేపోవును. ఇప్పుడు స్వకృతకర్మవిశేషంబునం గలిగి జాతికిఁ దగిన యాహారము గుడుచుట నీకుఁ దోషము కానేరదు. అదియునుం గాక గొప్పవారు గూడ నాపత్కాలముల యందు భక్షింపఁదగినవానిం దిని ప్రాణములు నిలుపుకొందురు. నీ మాట చెప్పనేల? మరియు నీకు చండలాశనశంక గలుగజేయు వస్తువులేమియు నేను దీసికొని రాలేదు. ఈ ఫలములం దినవచ్చును. పుల్కనభాండగతముకన్న నేలఁబడిన యుదకము పవిత్రమని చెప్పుదురు. అట్టిదానినైనఁ ద్రాగరాదా ? ఊరక యేమిటికి క్షుత్పిపాసలచే నాయాసపడియెదవు? మునిజనోచితమైన యీ ఫలముల నేమిటికి భక్షింపవు? ఈ నీరేమిటికి త్రాగవు? అని పలుకుటయు