పుట:కాశీమజిలీకథలు-05.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

333

సీ. కుక్కలతో గూడికొని గుంపుగుంపుగా
             చండాలబాలకుల్ సంచరింప
    దూషితమాంసమేదోవళాకర్ధమ
             ప్రాయకుటీరరాజితములు వెలయ
    గుడిసెలచుట్టు బల్ గోటగాఁ గట్టిన
             వెదురుకంపల దడుల్ వీథులంట
    నస్థిరాసులఁ జేరి యరపులతో మీఱి
             కుర్కురంబులు దాడి గ్రుద్దులాడ

గీ. బురదగుంటలఁ బందులు పొర్లులాడ
   విస్రగంధిరజోధూమవితత మగుచుఁ
   దలపఁజూడ నసహ్యమై తనరునట్టి
   పక్కణము గానఁబడియె నప్పతగపతికి.

నరకవాసులకుఁగూడ నుద్వేగము గలుగఁజేసెడు నామాలపల్లెం జూచి జుగుప్స జెందుచు నాహా! ఆ చండాలకన్యక దూరమునందే నన్నుఁ జూచి కరుణ జనింప వదలివేయుమనునా? వట్టిది వట్టిది జాతికిం దగని యట్టిపని యెన్నడుం జేయదు. కానిమ్ము. నాపురాకృత మిట్లున్నది ఏమి జేయుదును? నిమిషమైన నిందుండ జాలనని తలంచుచుండగనే వాఁడు నన్నామెకడకుఁ దీసికొనిపోయి తల్లీ! అవధారు! ఇదిగో నీవు చెప్పిన చిలుకం దీసికొని వచ్చితిని. చూడుమని నమస్కరించి నన్నుఁ జూపెను.

ఆ మగువ మిగుల సంతోషించుచు మంచిపని గావించితివని వాని మెచ్చుకొని నన్ను వాని కరమునుండి తన రెండు చేతులతోఁ గైకొని పుత్రకా నేటికిఁ దొరికితివి? ఇంకెక్కడికి బోఁగలవు? నీ కామచారదోషమంతయుఁ బోగొట్టెదఁ జూడు మని పలికినది. అప్పుడొక ఛండాలబాలకుఁడు పరుగెత్తుకొనిపోయి లోమశంబై దుర్గంధయుక్తంబగు గోచర్మముచేఁ గప్పబడిన దారుపంజర మొకదానిం దీసికొని వచ్చి యామె ముందర నుంచెను మహాశ్వేతావలోకనమనోరథములతోఁ గూడ నన్ను లాగి “యిందుండుము. కదలకుమని" పలుకుచు న న్నాపంజరములో వైచి తలుపు బిగించినది అప్పుడు నే నాత్మగతంబున నిట్లు తలంచితిని.

అయ్యో! నేనిప్పుడు గొప్ప యాపదలోఁ బడిపోయితిని. శిరస్సుచే నమస్కరించి నా యవస్థయంతయు నీమె కెరిగించి వదలుమని బ్రతిమాలుకొందునా? సరిసరి నేను లెస్సగా మాటాడుదుననియేకాదా? యీ పైదలి నన్నుఁ బట్టించినది. కావున నట్లు బ్రతిమాలుకొనుట వలన లాభములేదు. నా బంధనపీడ యీమె నేమి బాధించును? తనయుండననియా! సోదరుండననియా? బంధువుఁడననియా? కావున