పుట:కాశీమజిలీకథలు-05.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

329

డించుచు నే నిట్లంటిని. సఖా! కపింజల! సకలక్లేశపరిభూతుండనగు నాకీ శోకము తగునుగాని నీవిట్లు విలపించెదవేమిటికి? నీవు బాలుండవైనను సంసారబంధాత్మకములగు రాగాది దోషముల నంటక వర్తింపుచుంటిని. ఈమూఢజనమార్గమును విడువుము. కూర్చుండి చెప్పుము. మా తండ్రి కుశలుడై యున్నవాడా? నన్నెన్నడైన స్మరించునా? ఈ వృత్తాంతము విని యేమనుచున్న వాడు? కోపము సేయుచుండెనా? యేమి? అని నేనడిగిన నతండు హరీతశిష్యునిచే వేయబడిన పల్లవాసనమున గూర్చుండి నన్నుఁ దొడయం దిడికొని హరీతకునిచే నీయబడిన యుదకముచే మొగము గడిగికొని నా కిట్లనియె.

మిత్రుఁడా! మీ తండ్రి కుశలుఁడై యున్నవాఁడు మన వృత్తాంత మంతయు దివ్యదృష్టిచేఁజూచి ప్రతిక్రియకొరకుఁ బ్రయత్నించుచుండెను. అంతలో నేను తురగత్వమును విడిచి ఆయనయొద్దకుఁ బోయితిని. దూరమునందె. నన్నుఁజూచి కన్నుల నశ్రుజలంబుగ్రమ్మ భయపడుచున్న నన్నుఁ జేరదీసి గారవింపుచు నిట్లనియె.

వత్సా! కపింజల! వగవకుము ఈ తప్పు నాది కాని మీది కాదు. పుండరీకుఁడు పుట్టినప్పుడే వాని కిట్టి దోషమున్నదని యెరింగియుఁ బ్రమాదంబున నాయుష్కరమగు కర్మ నిర్వర్తించితిని కాదు. ఇప్పుడన్నియుం దీర్చితిని. కొలఁది దినములలో నీ కష్టములన్నియు బోవగలవు. అంత దనుక నీవు నా యొద్ద నుండుమని యాజ్ఞాపించుటయు నే నిట్లంటి.

తాతా! నీకు నాయందనుగ్రహము గలిగినచో నా మిత్రుఁడెందుండెనో యచ్చటికిఁ బోవుట కాజ్ఞ యిమ్ము. వానిం జూడ నాకు మిగుల లనాతురముగా నున్నదని యడిగిన నమ్మహర్షి యిట్లనియె. వత్సా! వాఁడిప్పుడు చిలుకగా నుదయించి యున్నవాఁడు. నీవు వోయియు వానిం దెలిసికొనఁజాలవు. వాఁడును నిన్నెరుఁగడు. కొంతకాల తిరుగనిమ్మని యాజ్ఞాపించెను. నేనందే యుంటిని. నేఁటి యుదయంబున నన్నుఁ జీరి యా పారికాంక్షి వత్సా! కపింజల! నీ మిత్రుఁడిప్పుడు మహానుభావుండైన జాబాలి యను మహర్షి యాశ్రమములో నున్నవాఁడు. వానికిప్పుడు తత్ప్రసాదంబున బూర్వజన్మస్మృతి గలిగినది. కావున నీవిప్పు డతనిం జూడఁబొమ్ము కర్మ పరిపక్వ మగువరకు నా మహాత్ముని యాశ్రమము విడువవలదని నా మాటగాఁ జెప్పుముఁ అని యుపదేశించెను. మరియు నీ తల్లియగు లక్ష్మియు నీ దుఃఖము విని దుఃఖించుచు నీ విముక్తి కొరకై యమ్మునికిఁ బరిచర్య చేయుచున్నది. ఆమెయు నీకిట్లే చెప్పు