పుట:కాశీమజిలీకథలు-05.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మని పలుకుచు నొక్కింత సేపుండి పిమ్మట దమదమ నివాసములకుఁ బోయిరి. హరీతకుండును నన్ను మెల్లగా జేతియందెక్కించుకొని పర్ణశాల యందొక వేదికయందు భద్రముగా నునిచి తాను స్నానార్ధ మఱిగెను.

పిమ్మట నే నాత్మగతంబున అయ్యో! అనేక భవసుకృత పరిపాకంబునం గాని మానుషదేహంబు గలుగదు. దానియందును సకలజాతి విశిష్టమైన బ్రాహ్మణ్యము దుర్ఘటమైనది. అంతకన్న నా సన్నా మృత పదముగల మునిత్వము విశిష్టతరమైనది. దివ్యలోక నివాసిత్వ మంతకన్న విశేషమైనది. అట్టి యున్నతపదమునుండి స్వదోష మూలముననే యధోగతింబడి యిట్టి తిర్యగ్జాతియందుఁ బుట్టితిని. అన్నన్నా! ఎంత మోసము వచ్చినది. సీ! ఇఁక నాకీ జీవితముతోఁ బ్రయోజనమేమి? ఈ శరీర మెట్లయినను సరియే విడిచి విధిమనోరథమును సఫలము జేసెదనని యూహించి జీవితమును విడుచుటకు నిశ్చయించుకొని యుంటిని.

ఇంతలో హరీతకుఁడు వచ్చి అన్నా! వైశంపాయన! నీ పుణ్యము మంచిది. నీ తండ్రియొద్దనుండి నిన్ను వెదకిఁకొనుచుఁ గపింజలు డిచ్చటి కిప్పుడు వచ్చెనని చెప్పుటయు నే నప్పుడు రెక్కలు వచ్చిన దానివలె నెగరబోయి యత్యంత సంతోషముతో నతం డెక్కడనని యడిగితిని.

అప్పుడు హరీతకుఁడు అతండు మా తండ్రి యొద్దనుండి మాటలాడు చున్నవాఁడని చెప్పినవిని నేను ఆర్యా! అతనిం జూచుటన నా హృదయము మిక్కిలి పరితపించుచున్నది. నన్ను వేగమ వాని చెంతకుఁ దీసుకొని వెళ్ళుమని ప్రార్ధించు చుండఁగనే యా కపింజలుఁడు గగనమార్గమునఁ బూర్వరూపముతో నా యొద్దకు వచ్చెను.

వానిం జూచి నేను గన్నీరుగార్చుచు నట్లుండియు నెదురుకొనఁ బ్రయత్నించితినికాని రెక్కలు రామింజేసి శరీరము కదిలినదికాదు. అప్పుడు నేను దీనస్వరముతో వయస్యా! కపింజల! జన్మద్వయాంతరిక దర్శనుండవగు నీ రాక చూచి తొందరగా లేచి యెదురుకొనుచు జేతులుచాచి గాఢముగా నాలింగనము జేసికొనుటకును జేయి పట్టుకొని పీఠంబున గూర్చుండబెట్టుకొనుటకు సుఖాసీనుండవైన నీకు గమనా యాసంబువాయ నడుగులొత్తుటకు నాకు యోగ్యత లేకపోయినది కదా! యని చింతించుచున్న నన్ను గపింజలుడు తన రెండుచేతులతోడ నెత్తి పట్టుకొని యాలింగన సుఖంబనుభవించువాడుఁబోలె వక్షమున నిడుకొనుచు శోకంబున మదీయచరణంబుల శిరంబున నుంచుకొనుచు బ్రాకృతుండువోలె బెద్ద యెలుంగున రోదనముజేసెను.

అట్లు పెద్ద యెలుంగున బ్రాకృతుండువోలె శోకించుచున్న యతని నూర