పుట:కాశీమజిలీకథలు-05.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

327

గిన సిగ్గుచేత నించుక తలవంచుకొని కొంచెముసే పూరకొని నే నల్లన నా జాబాలి కిట్లంటి.

దేవా! నీ యనుగ్రహంబున మదీయ పూర్వవృత్తాంతమంతయు స్మరణకు వచ్చినది. యాప్తులనందరను స్మరించుకొంటిని. నా మృతిని వినినంత హృదయము భేదిల్లఁ జైతన్యమును విడిచి చంద్రాపీడుఁడు జన్మాంతరమున నే శరీరమును దాల్చెను? దయయుంచి వక్కాణింపుఁడు అతనితోఁ గలసికొంటినేని తిర్యగ్యోని యందున్నను నాకు సంతసముగానే యుండునని యడిగిన నమ్మహర్షి పుంగవుండు కన్నుగవఁ గెంపుగదుర నన్నుఁ జూచుచు, దురాత్మా! నీ చిత్తచాంచల్య మింకను విడువకున్నవాడవే! దాని మూలముననేకదా! ఇట్టియవస్థ ననుభవింపు చున్నవాఁడవు. ఇప్పుడు నీకు రెక్కలైనను బూర్తిగా రాలేదే! తొందర పడియెదవేల? ఎగురుటకు సామర్ధ్యము వచ్చినపుడు నన్నీ సంగతి నడుగుము చెప్పెదనని పలికినవిని హారీతకుం డిట్లనియె.

తాతా! ఈతండు మునిజాతియందు జనియించియు జీవితమును విడుచునంత కంతుసంతాపమును జెందెనేమి? దివ్యలోక సంభూతున కల్పాయువు గలుగు టెట్లు? నాకు మిక్కిలి విస్మయముగా నున్నది ఎఱింగింపవే? యని యడిగిన నమ్మునిమార్తాండుండు వెండియు నిట్లనియె.

వత్సా! యీతండు కామరాగ మోహమయము నల్పసారమునైన స్త్రీ వీర్యమువలనఁ బుట్టుటచే నట్లయ్యె. అల్పసారమగు స్త్రీవీర్యంబునం బొడమిన జంతువు గర్భంబుననే హరించును. లేక చచ్చియైనం బుట్టును జీవించి పుట్టినను దీర్ఘకాలము బ్రతుకదని యాయుర్వేదంబున స్పష్టముగాఁ జెప్పఁబడి యుండ దీనికి విస్మయమేల! దద్దోషంబునంజేసి వీఁడు కామరతుండై మదనజ్వర వేగంబున సమసె. శాపావసానకాలంబున దీర్ఘాయుష్మంతుండై యొప్పునని చెప్పెను.

అప్పుడు నేను వెండియు మహాత్మా! నేను బాపాత్ముండనై యీ తిర్యగ్యోని యందు జనియించితిని. నీ యనుగ్రహంబు నాకు వాక్కు మాత్రము వచ్చినది. యభూతపూర్వమైన జ్ఞానము గలిగినది నాకే సుకృతంబున నీరూపము వాయగలదు? ఆయువెట్లు వర్థిల్లును? నే చేయవలసిన కృత్యమెద్ది? దయామయుఁడవై యెఱింగింపు మని ప్రార్థించిన విని యజ్జాబాలి దిఙ్ముఖంబులు సూచుచు, అయ్యో! ఈ కథామూలంబునఁ దెల్లవారిపోయినది. యనుష్టానవేళ యతిక్రమించినది. యది యట్లుండనిమ్మని పలుకుచు నాగోష్ఠి చాలించి లేచుటయు నమ్మునులందరు తత్కథారసాస్వాదనంబునఁ జేయదగిన కృత్యములు మరచి విస్మయమందుచు నెంతకష్ట