పుట:కాశీమజిలీకథలు-05.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పయనము మాట దలపెట్టక పాపము నా నిమిత్తమీ మత్తకాశిని యుత్తలముందుచున్నదని చిత్తంబునం దలంచుచున్నవాఁడు గాబోలు! కానిమ్ము! నేనతనింజూచి యేమియు మాట్లాడను. పాదంబులఁబడినను గ్రహింపను. మదనలేఖా! నీవప్పుడు నాతో నేమియుం జెప్పవద్దుసుమీ! పెద్దతడవు చిక్కులు పెట్టి పిమ్మట మాట్లాడెదనని యతని గురించిన మాటలే చెప్పుకొనుచు మార్గమున ఖేదము గురుతెరుంగక క్రమంబున జంద్రాపీడునిఁ జూడ మిక్కిలి తొందరపడుచు నమ్మహాశ్వేతాశ్రమమునకు వచ్చెను.

అట్లు వచ్చి యందు అమృతరహితమగు సముద్రంబు చందంబున నున్ముక్తజీవితుండై పడియున్న చంద్రాపీడునిం జూచి కాదంబరి హా! ఇది యేమి కష్టమని మూర్ఛాక్రాంతస్వాంతయై నేలం బడుచుండ మదనలేఖ తటాలునఁ బడకుండ బట్టుకొనినది. పత్రలేఖయుఁ గాదంబరియొక్క కైదండ విడిచి మోహావేశముతో నొడలెరుంగక నేలంబడిపోయినది.

కాదంబరియుఁ గొంతసేపటికి దెప్పిరిల్లి మూఢయుంబోలె నేమియు నెరుంగక యూర్పులు విడుచుట సైతము మరచి రెప్పవాల్చక నిశ్చలతారకలతో నతని మొగమే చూచుచు వ్రాయఁబడిన ప్రతిమవలె కదలక యట్టె నిలిచియుండం జూచి మదనలేఖ యామె పాదంబులబడి సఖీ! నీవీ శోకమును విడువుము. స్వభావమృదు సరసమగు నీ హృదయము అతివృష్టి భారంబున విచ్చిన తటాకమువలె భేదిల్లును సుమీ! ఈతండు చైతన్యంబు బాసి పరలోకమున కతిథియైనట్లు తోచుచున్నది. ఇఁక వీనికొరకుఁ జింతింపనేల? యింటికిఁబోయి తల్లిదండ్రుల కామోదము గలుగఁజేయుము. నిన్నుఁజూడక వారు నిముషము తాళలేరని పలికిన విని కాదంబరి నవ్వి యవ్విద్రుమోష్టి కిట్లనియె.

ఓసి వెర్రిదానా! నా హృదయమును మృదువుగా జెప్పుచుంటివేమి? వజ్రసారకఠినమైనది. కాకున్న నిట్టి యవస్థఁ జూచియు బగులకుండునా? మరియు జీవించువారికిగదా తల్లిదండ్రులు బంధువులు పరిజనము కావలయును. నాకిక వారితో బనియేమి? స్వర్గగమనోన్ముఖుఁడైన వీనికి నమంగళముగా నేను రోదనముగూడ జేయను. పాదధూళియుం బోలెఁ బాదముల ననుసరించియే పోయెదను. ఎవ్వనికొరకు కులమర్యాద విడిచి ధర్మము గణింపక తల్లిదండ్రుల లెక్క సేయక జనాపవాదము నిరసించి సిగ్గునిడిచి వయస్యల గష్టపెట్టి మహాశ్వేతను గురించి చేసిన శపథము సైతము పరామర్శింపక ప్రయత్నించితినో యట్టివాఁడు నా నిమిత్తము ప్రాణములు విడువ నాయసువుల నెట్లు పాలించుకొందునో చెప్పుము. నా కిప్పుడు మరణమే శ్రేయముగా నున్నది. నాయెడ నీకుఁ గనికరమున్న యెడ నా చెప్పిన చొప్పున జేయఁ బూనుకొనుము. వినుము.

గీ. శూన్యమగు నాదు భవనంబు జూచి చూచి
    సఖులు పరిచరులును బంధుజనము లెట్లు