పుట:కాశీమజిలీకథలు-05.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ధర్మమేకదా. నీ విప్పుడు న న్నాత్మప్రదానంబున రక్షింపవేని తప్పక నీకు బ్రహ్మహత్యాపాతకము రాఁగలదని పలికెను.

దానిమాటలు విని నేను రోషానలంబున భస్మము చేయుదానివలె బాష్పస్ఫులింగదృష్టిచే వానింజూచుచు నావేశించిన దానివలె నొడలెఱుంగక కోపవేగరూక్షాక్షరముగా హుమ్మని పలుకుచు నిట్లంటి.

ఓరీ పాపాత్ముడా! నన్ను నీ వి ట్లనిన నీతల పిడుగుపడినట్లు నూరువ్రక్కలయినదికాదేమి? నీజింహ లాగికొనిపోలేదే? సకలలోకశుభాశుభసాక్షిభూతములగు పంచభూతములు నీయందు లేవా యేమి? వాని చేతనయిన మడియవైతివే? మూఢుఁడా! ఇట్టి కామవృత్తి గలిగిన నీవు తిర్యగ్జాతియందు బుట్టక యిట్లేల పుట్టితివి? వక్రముఖానురాగము కలిగి స్వపక్షపాతమాత్రప్రవృత్తితో నొప్పుచు స్థానాస్థాననిరూపణవిధం బెరుంగక చిలుకవలె హతవిధిచేఁ బలికింపఁబడితివి. శుకజాతియందైన బుట్టకపోయితివేమి? ఆత్మవచనానుగుణమగు జాతియందుఁ బుట్టితివేని యిట్లు నన్నుఁ గామింపక పోవుదువు కదాయని పలుకుచుఁ జంద్రమండలమున దృష్టి యిడి దేవా? సకలలోకచూడామణీ! లోకపాలా! నేను బుండరీకునిఁ చూచినది మొదలు యితర దృష్టిలేక యతనినే ధ్యానించు దాననైతినేని వీఁడు నా మాటచే హీనజాతియందుఁ బుట్టునని పలికితిని.

అప్పుడతండు మదీయశాపముననో మదనజ్వరవేగముననో పాపవిపాకముననో తెలియదుకాని నేనట్లు పలికినతోడనే నరకబడిన తరువులవలెఁ జేతనము బాసి నేలంబడియెను అతండట్లు గతాసుండగుటయుఁ దత్పరిజనము పెద్దయెలుంగున రోదనము జేసెను. అయ్యాక్రందనము వలననే యతండు దేవర మిత్రుఁడని తెలియవచ్చినదని పలికి తలవంచుకొని మిక్కుటమగు నశ్రుధారచే భూమినిఁ దడిపినది.

అట్టి మాటలు విని చంద్రాపీడుఁ డాకర్ణాంతవిశాలమగు నేత్రములు మూయుచు, భగవతీ! కాదంబరితో నన్ను గూర్చుటకు నీవు తగిన ప్రయత్నము చేసితివి. మందభాగ్యుండనగు నా కట్టి యోగ్యత లేనప్పుడు నీవేమి చేయగలవు? ముందుజన్మమునకైనఁ గాదంబరీచరణపరిచర్యాసుఖము గలుగున ట్లనుగ్రహింపుమని పలుకుచునే హృదయము భేదిల్ల నట్టె నిలువంబడి ప్రాణములు విడిచెను.

చంద్రాపీడుఁడు వయస్యుని మరణవార్తను వినినతోడనే డెందము పగిలి జీవితము వాయుటఁజూచి తరళిక మహాశ్వేతను విడిచి యతనిం బట్టుకొని అయ్యో! చేడియా! యింకను సిగ్గేమిటికే? యీతఁడు ప్రాణములను విడిచినట్లు తోచుచున్నది. మెడనిలుపక వాలవైచెను చూడుము. శ్వాసమారుతము లేమియు వెడలుట గనంబడదు. కన్నులు మూయఁబడియున్నవి? హా! చంద్రాపీడ! కాదంబరీప్రియ! యిప్పు డిప్పడతిని విడిచి యేడకుఁ బోయితివి. యా ప్రేముడియంతయు నెందుఁబోయె