పుట:కాశీమజిలీకథలు-05.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

317

పరలోకసుఖప్రదంబు రూపగుణహీనులు సైత మైహికసుఖంబు లనుభవించుచుందురు. ఆకృతిమంతులమాటఁ జెప్పనేల? తుషారబిందుపాతంబున పద్మినీలతయుంబోలె స్వభావసుందరమగు నీశరీర మిట్లు తపఃక్లేశంబునం గృశియించుట జూచిన నాకు మిక్కిలి విచారమగుచున్న యది. మఱియొక నీవంటివాల్గంటియే యింద్రియసుఖంబుల నిరసించి వైరాగ్యమును బూనియుండ నిఁక దర్పకుని పుష్పసాయకధారణము వ్యర్థము సుమీ! చంద్రోదయముతోఁ బనియేమి? వసంతమలయానిలములరాక నిరర్ధకమే! కువలయ కల్హార కమలాకర విలసనములు నిష్ప్రయోజనములు మనోహరోద్యానభూము లెవ్వరికిఁ గావలయునని పెక్కు తెరంగుల వక్కాణించెను.

పుండరీకునికథ జరిగినది మొదలు నే నుత్సాహ ముడిగి యుంటిని కావున వానిమాటలు విని నీవెవ్వడవు? నీ పేరేమి? నీవృత్తాంతమెట్టిది? నన్నిట్లు పలికెదవేల యని యడుగకయే యచ్చటినుండి మఱియెకచోటికి బోయి దేవతార్చన పుష్పములం గోయుచున్న తరళికంజీరి యిట్లంటిని.

తరుణీ! యీతరుణుం డెవ్వఁడే? వీని యాకారముఁ జూడ బ్రాహ్మణకుమారుఁ డట్లతోచుచున్నయది. నన్నుజూచినంత వీనిస్వాంతమున వెర్రి చేష్ట లంకురించుచున్నయవి. కావున వాని నిచ్చటికి వెండియు రాకుండునట్లు చేయుము. కూడఁ గూడ తిరుగుచున్నవాఁడు. నివారించినను వచ్చెనేని తప్పక యమంగళమును జెందగలఁడని పలికితిని.

అదియు నతనితోఁ దగినట్లు చెప్పినది కాని మదనహతకునివృత్తి దుర్నివార్యమైనదగుటచే వానిచిత్తము మరలినదికాదు.

మరికొన్ని దినములు గడచినంత నొకనాఁడురాత్రి జ్యోత్స్నాపూరముచే జగంబంతయు నిండియుండ సంతాపంబువాయ నేనీ శిలాతలంబున శయనించి మందమందముగా నచ్చోదానిలపోతములు వీచుచుండఁ బుండరీకుని వృత్తాంతమే స్మరించు కొనుచు నిద్రపట్టమింజేసి యిందుబింబవిలాస మరయుచుఁ గన్నులుమూయక యట్టె చూచుచుంటిని.

అట్టిసమయమున నా బ్రాహ్మణకుమారుఁడు మదనావేశితహృదయుండై మెల్లగా నడుగులిడుచు నాయొద్దకు వచ్చెను. నిస్పృహురాలనైనను వానిఁజూచినంతనే స్వాంతమున భయము జనింప నిట్లు తలంచితిని. అయ్యో! మంచియాపద తటస్థించినదే! వీఁడు నన్ను ముట్టినంత మాత్రమునఁ బ్రాణములు విడువవలసినదేకదా. పుండరీకునిరాక నిరీక్షించి యిన్నిదినములు ప్రాణములు దాల్చినది వ్యర్థమైపోవునే యని యాలోచించుచున్న సమయమున నతండు నాదాపునకువచ్చి యిట్లనియె.

ఇందుముఖీ! కందర్పునితోఁగూడ నన్నిప్పు డీచందురుఁడు చంపుటకుఁ బ్రయత్నించుచున్నవాఁడు కావున నిన్ను శరణు జొచ్చితిని. అనాథునాతున్ నప్రతీకారాక్షు భవదాయత్తు నన్ను రక్షింపుము. శరణాగతపరిత్రాణము తపస్వీజన