పుట:కాశీమజిలీకథలు-05.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యణఁగియున్నవాఁడు. మనలను జూచి పారిపోవును. కావున మీ రందరు గుర్రముల నుండియే లతాగహనములను తరుమూలములు లతామంటపములు మొదలగు ప్రదేశములలో విమర్శగా నరయుఁడని పలుకుచుఁ దాను మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నతని వెదకెనుకాని యెందును అతనిచిహ్నము లేమియుం గనంబడినవికావు.

అప్పుడతండు పెక్కుతెరంగులఁ జింతించుచు వైశంపాయనుని వార్త మహాశ్వేతకేమైనం దెలియునేమోయనియుఁ గాదంబరీ విశేషములుగూడఁ దెలియబడు ననియు నూహించి తురగసైన్యమంతయు దదీయాశ్రమమున కనతిదూరంబున నుండ నియమించి సముచిత పరివారముతోఁ దానింద్రాయుధమెక్కి యామె యాశ్రమమునకుఁ బోయి గుహాముఖంబున వారువమును డిగ్గి సన్ననివస్త్రములుదాల్చి యక్కందరాంతమునకుఁ బోయెను.

అందు శోకవేగంబున నవయవంబులు చలింప గన్నులనుండి ధారగా నీరుగార్చుచుఁ గాలివానతాకుడున వాడినతీగెయుంబోలె మొగమువంచి తరళిక కేలు బట్టుకొనఁబడియున్న మహాశ్వేతఁ జూచి యతండు విభ్రాజితుండై అయ్యో! కాదంబరి కెద్ది యేని యప్రియము జరిగియుండఁబోలుఁ! గానిచో నిమ్మానిని యిట్లుండదు. ఏమి దైవమా! యని ప్రాణంబులెగిరి పోయినట్లు సారెసారెకుఁదొట్రుపడుచు మెల్లగాఁదాపునకుఁ బోయి బోటీ! యీమె యిట్లున్న దేమి? యని తరళిక నడిగిన నప్పడతియు నేమియుంజెప్పక యట్టి యవస్థలోనున్నను మహాశ్వేత మొగము జూచినది. అప్పుడా సాధ్వియే క్రమంబున శోకవేగం బడంచుకొని గద్గదస్వరముతో నన్న రవరసూతి కిట్లనియె.

మహాభాగ! సిగ్గులేని యీపాపాత్ము రాలేమిటికి జెప్పకుండును? వినుండు. కేయూరక ముఖముగా భవదుజ్జయినీగమన వృత్తాంతమునువిని మనమెఱియ అయ్యో! మదిరాచిత్రరథుల మనోరథమును దీర్పలేక పోయితిని. కాదంబరికోరికయు సఫలము చేయలేకపోయితిని. యారాజకుమారుని యభీష్టము తీరినదికాదు. నేనువచ్చి యేమిచేసితినని సిగ్గుపడుచుఁ గాదంబరీ స్నేహపాశములంగోసి వెండియు దపంబుజేయుటకై యీ యాశ్రమమునకువచ్చి యిచ్చట దేవరఁబోలియున్న యొక్క బాహ్మణకుమారుం డెద్దియో వెదకుచున్నట్లు శూన్యహృదయుఁడై నలుమూలలు జూచుచుండ గంటిని.

అప్పు డతండు నా యొద్దకు మెల్లగావచ్చి యదృష్టపూర్వుండై నన్ను నెన్నఁడో యెఱిఁగిన వాడుంబోలె నాముఖము రెప్పవాల్పక చూచుచు నాకిట్లనియె.

శోభనాంగి! లోకంబున నెవ్వరును జన్మకును వయసునకును రూపమునకునుం దగినట్లు మెలంగిరేని నిందాపాత్రులుకారు నీవట్లుగాక తగనిప్రయత్నము చేయుచుంటివేమి? కుసుమసుకుమారమగు నీమైదీగె నుత్కృష్టతపఃకరణక్లేశంబున నిట్లు వాడఁజేయనేమిటికి? సుమనోమనోహరంబగు లతయుంబోలె నీయాకృతి ప్రాయమునకుఁ తగినయట్లుగా రసాశ్రయమగు ఫలముతోఁ గూడుకొనకుండుట లెస్సయే. తపంబు