పుట:కాశీమజిలీకథలు-05.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

315

అంత నింతింతనరాని సంతసముతోఁ గంతుసంతాపమునఁ గృశించియున్న యవయవములకు గాఢాలింగన సుఖరసభరంబున నుబ్బుగలుగఁ జేయుచుఁ దరువాత నా నాతితోఁగూడ మదనాగ్ని నార్పునదియు నింద్రియములకు సుఖమిచ్చునదియుఁ బెక్కుసారు లనుభవించుచున్నదైనను గ్రొత్తదానివలె దోచునదియు నిట్టిదని చెప్పుటకు నలవి కాని సంతోషము గలుగజేయునదియు నిర్వాణసుఖసాదృశ్యము గలదియు నచింత్యమయినదియు నగు సుఖ మనుభవించుచు నిమిషమైనను విడువక రమ్యప్రదేశములఁ గ్రీడింపుచు యౌవనమునకుఁ దృప్తిగలుగఁజేసెదను.

ఆ రీతిఁ కాదంబరికి సంతోషము గలుగఁజేసి మదనలేఖను వైశంపాయనునకుఁ బెండ్లిచేసెదను. అని యిట్లు పెక్కు తెరంగుల నంతరంగమ్మునఁ దలపోయుచు మేను గరుపుజెంద ననుభూతుఁడైన వాఁడుంబోలె నా రాత్రి నిద్దురంజెందక తృటిలాగున గడిపి యుదయంబున లేచి సముచిత పరివారంబు సేవింప నింద్రాయుధ మెక్కి యక్కుమారుం డప్పురము వెడలి కతిపయప్రయాణంబుల నచ్ఛోదసరస్స్తీరమునకుఁ బోవుచు నించుకదూరములో నెదురుపడిన మేఘనాథునింజూచి యత్యాతురముగా నిట్లనియె.

మేఘనాథా! అచ్ఛోదస్సరస్స్తీరంబున నీకు వైశంపాయనుఁడు కనంబడియెనా? చూచి మాట్టాడితివా? ఏమనియెను? ఇప్పటి కైనం పశ్చాత్తాపముజెంది యింటికి రావలయునని తలంచుచున్న వాఁడా! నామాట యేమైనం దెచ్చెనా? యతనికి తల్లిదండ్రులు జ్ఞాపకముండిరా? యని యడిగిన నతం డిట్లనియె.

దేవా! దేవర ఇదిగో నేను వైశంపాయనునితో మాట్లాడి నీ వెనుకనే వత్తునని చెప్పితిరికదా! మేమట్లుపోయి మీ రాక వేచియుండ నెప్పటికి వచ్చితిరి కారు. అప్పుడు పత్రలేఖయుఁ గేయూరకుఁడు నన్నుఁ జూచి మన చంద్రాపీడుని వర్షాకాల మగుటచేఁ దల్లితండ్రులు రానిచ్చిరి కారు. నీ విచ్చోట నొక్కరుఁడ వుండనేల ఇంటికిఁ బొమ్మని పలికి వారిరువురు హేమకూటమునకుఁ బోయిరి.

నేను మరికొన్నిదినము లందుండి తిరుగా నింటికి వచ్చుచున్నవాఁడ నింతియకాని వైశంపాయనుని వార్త నాకేమియుం దెలియదు. అతం డచ్ఛోదసరస్సునకుఁ బోవుటయే నేనెరుఁగనని చెప్పినవిని యా రాజకుమారుఁడు వెండియు వానితో నోరీ! అట్లయిన సరియేకాని పత్రలేఖ యిప్పటికి హేమకూటము జేరునో లేదో చెప్పఁగలవా? యని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! దైవికమైన యంతరాయమేదియు రాకుండిన నది యాలస్యము చేయునదికాదు. కావున నేటిఁ కబ్బోటిఁ హేమకూటము జేరుననియే, నాయభిప్రాయము. అని చెప్పిన సంతసించుచుఁ జంద్రాపీడుఁడు వానితోఁ గ్రమంబున వైశంపాయనునిం జూచు వేడుకతో నచ్ఛోదసరస్సునకుఁ బోయి యందు గుర్రపురౌతుల కిట్లనియె.

వైశంపాయనుఁడు వైరాగ్యవృత్తింబూని యీ వనములో నెచ్చటనో