పుట:కాశీమజిలీకథలు-05.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

కాశీమజిలీకథలు - ఐదవభాగము

బున జింతిల్లకుము. వైశంపాయనుని దీసికొని వచ్చుటకు మా తండ్రి నా కానతిచ్చెను. నేను వెళ్ళి యనఁతికాలములో నాతనిం దెచ్చెదను. నీవుగూడ ననుజ్ఞయిమ్ము. పోయి వచ్చెదననుటయు నామె యిట్లనియె.

వత్సా! నేను వెళ్ళెదనను మాటచే నాకు శోకోపశమనము జేసెదవేల? నాకు నతనియందుకన్న నీయందు మక్కువ మెండు నీవు పోయిన నెవ్వరిం జూచికొని ధైర్యమవలంబింతును? నీవు బోవలదు. దైవానుగ్రహము గలిగిననాఁడే రాగలఁడు. లేక మరియెవ్వరినేని బంపుదురుగాక. యని పలికినవిని విలాసవతి యిట్లనియె. సఖీ! మన యిరువురకు వారిరువురయందును సమానప్రేమ గలిగియున్నది. వానిఁజూడక నేను మాత్రము సైరింపగలనా! వారింపఁకుము. మనము వారించినను జంద్రాపీడుఁడు నిలుచువాఁడుకాడు. యనుజ్ఞ యిమ్మని పలికిన నక్కలికియు నెట్టకేలకు సమ్మతించినది.

అంతలో సాయంకాలమగుటయుఁ జంద్రాపీడుఁడు ఆ రాత్రి భోజనము చేసి తల్పంబున శయనించి సంకల్పశతములచే మనోరధములఁ బూరించుకొనుచు నిట్లు తలంచెను.

నేను ముందుగా నచ్ఛోదసరస్సునకుఁబోయి యందు వెనుక వెనుకగా నరిగి వైశంపాయనుని కంఠగ్రహణము చేసి నీ విం కెందు బోవఁగలవని పలికిన నతండు నా మాట ద్రోయనేరక నాతో వచ్చునుగదా. పిమ్మట మహాశ్వేత యాశ్రమమున కరిగి యందుఁ బరిజనము నునిచి యామెతోఁగూఁడ హేమకూటమునకుఁ బోయెదను.

అందు నన్నుం జూచి కాదంబరి పరిజనము తొందరగా నిటునటు తిరుగుచు నమస్కరింపుచుండఁ గ్రమంబునఁ గాదంబరి యున్నతా వరసి యరిగిన నత్తరుణియు నా రాక సఖులచే నెరింగి తటాలునఁ బుష్పశయ్యనుండి లేచి యత్యాతురముతో స్వాంగాలంకారముల సవరించుకొనును సిగ్గుచేఁ దలవంచుకొని శయ్యాసమీపంబున నిలువంబడియున్న యన్నారీలలామమును గాంచి కన్నులకలిమి సార్ధకము గావించెదను కదా.

తరువాత మదనలేఖను పత్రలేఖను గేయూరకుని యథోచితగౌరవంబున మన్నించుచు సాహసముతో వివాహప్రయత్నము చేయుటకు జిత్రరథునకు వార్త నంపెదను.

పిమ్మట నా కొమ్మను శుభముహుర్తమునం బెండ్లియాడి బహుళకుసుమదామభూషానులేపనాది వస్తుమండితమగు భవనంబునఁ ఋష్పశయ్యపై మత్సమీపమున గూర్చుండి వయస్య లరిగిన వెనుక తానును మొగమువంచి యరుగఁబోవు నయంబున బలాత్కారముగా సందిటిలో నిమిడ్చికొని తల్పంబునఁజేర్చి పిమ్మటఁ దొడయం దిడుకొని యెడమచేతితోఁ గేశపాశము గైకొని కుడిచేతితో నధరము పుడుకుచుఁ గపోలములఁ జుంబించుచు సురలకు సైతము దుర్లభమయిన యధరామృతము తనివితీరఁ గ్రోలెదను.