పుట:కాశీమజిలీకథలు-05.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

313

అప్పుడు తారాపీడుఁ డతనింజూచి యార్యా ! యూరడిల్లుము వ్యజనానిలముచేత వాయువును వృద్దిజేసినట్లు కదా! మీకు మేము బోధించుట! బహుశ్రుతుండైనను బ్రాజ్ఞుండైనను వివేకియైనను ధీరుండయినను దుఃఖాతిపాతంబునఁ జిత్తచాంచల్య మందకమానఁడు. మనస్సు చెడిన వానికేమియుం దెలియదుకదా! వైశంపాయను గురించి కోపావేశముతోఁ బలుకుచున్న నీమాటలు వినుటచే నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది. యతనియెడఁ గోపమును విడువుము. వాఁడు మిక్కిలి గుణవంతుడు. కారణ మఱయక వాని నిందింపరాదు. చంద్రాపీడు నంపి శీఘ్రముగా నిచ్చటికి రప్పించి యట్టి విరక్తి నేమిటికిఁ బూనెనో యరయుదముగాక! యరసినపిదప యథాన్యాయముగా నాచరింతమని పలికిన విని వెండియు శుకనాశుం డిట్లనియె.

దేవా! నీకు వైశంపాయనుని యందుగల మక్కువచే నిట్లనుఁచున్నావు. నీయౌదార్యమట్టిదియేకాని యువరాజునువిడిచి యాత్మేచ్ఛచే నుండుట గష్టమని పలికిన విని చంద్రాపీడుఁడు తండ్రియన్నమాట హృదయంబున ములికిపోలికనాఁటియుండ గన్నీరునించుచు గూర్చుండియే మెల్లగా దాపునకుఁబోయి శుకనాశున కిట్లనియె.

ఆర్యా! వైశంపాయనుని విషయమై నావలన నేమియు దోసములేదని చెప్పకపోయినను నేనెఱుంగుదు. అయినను మా తండ్రిగారి కనుమానము దోచుచున్నదని పలికిరికదా! లోకులు సైతమట్లే భావింతురు. అసత్యమయినను లోకాపవాదము భరించుట గష్టము. ఆయశఃప్రసిద్ధి లోకంబున వ్యాపించెనేని పరలోకహాని కాగలదు. కావున దీనికి బ్రాయశ్చిత్తముగా వైశంపాయనుని దీసికొని వచ్చుటకు నన్ను నియమింపుము. మఱియొకరీతి నాకు నిష్కృతి గలుగదు. తురగయానంబునఁ బోయిన నాకేమియు నాయాసము గలుగదు. గమనాభ్యనుజ్ఞ యిమ్ము. నేనుబోయి ప్రియమిత్రునిం దీసికొని వత్తును. అతండు రానిచో నేనుసైత మచ్చటనే యుండెదనని పలికిన విని శుకనాశుఁడు తారాపీడునితో దేవా! యువరాజు గమనమునకు విజ్ఞాపన జేసికొనుచున్నవాఁడు. సెలవేమియని యడిగిననతం డిట్లనియె.

ఆర్యా! మనమొకటి దలఁచికొనియుండ దైవము వేరొకటి తెచ్చి పెట్టెను. కానిమ్ము వైశంపాయను నవశ్యముగా యువరాజు దీసికొనిరావలయును. అతని విడిచి యీతఁ డొక నిమిషమైనఁ తాళలేఁడు తప్పక పోవలసినదే. యతని దీసికొనివచ్చుటకు నాయుష్మంతుని మాట జెప్పనేల, విలాసవతినైనఁ బంపెదనుసుమీ! యని పలికి దైవజ్ఞులరప్పించి యప్పుడే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించి పిమ్మటఁ జంద్రాపీడునిం జూచి రాజు వత్సా! నీవీవార్త మీ తల్లికిం జెప్పి వేగపొమ్మని పలుకుచు శుకనాశునితోఁగూడ దన భవనమునకుఁ బోయెను.

తరువాత నా రాజకుమారుఁడు తల్లి యొద్దకుఁబోయి నమస్కరించుచు దాపునం గూర్చండి మిక్కిలి విచారింపుచున్న మనోరమ కిట్లనియె. తల్లీ ! నీ వుల్లం