పుట:కాశీమజిలీకథలు-05.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

కాశీమజిలీకథలు - ఐదవభాగము

బహిర్ద్వారము దాపునకుఁబోయి యందు గుఱ్ఱమును దిగి యాస్థానమునకుఁ బోవుచున్నంతఁ దారాపీడుఁడు విలాసవతితోఁ గూడ శుకనాథుని గేహమునందున్న వాఁడను వార్త వినంబడినది.

అప్పు డతండును మరలి తానుగూడ నచ్చటికిఁ బోవుచుండఁ సమీపముగా నిట్టిధ్వని వినంబడినది.

హా! వైశంపాయనా? హా వంశపావనా! మదీయాంకసీమయందు లాలింపఁ బడుచుండెడి నీవిప్పుడు వ్యాళశతభీషణమయిన కాంతారములో నొంటిగా నెట్లుంటివి? అందు శరీరరక్ష నీకెట్లు జరుగుచున్నది. నీకు నిద్రాశుకమిచ్చుశయ్య నెవ్వరు గల్పించుచున్నారు? నీయాకలి గనిపెట్టి యన్నమిడువారెవ్వరు? పట్టీ! ఎట్టియవస్థవచ్చినది. అయ్యో! నీవు వచ్చినతోడనే మీతండ్రితో జెప్పి తగిన కన్యను వివాహము జేయవలయునని తలంచియుంటినే! మందభాగ్యురాలనగు నాకట్టి యదృష్టమెట్లుపట్టును. నన్నును మీతండ్రిని నీవున్నచోటికి దీసికొనిపొమ్ము. నిన్నువిడిచి మేము నిమషమైనఁ దాళలేము. ఇంత నిష్ఠురత్వము నీవేటికి బూనితివి? చంద్రాపీడునిఁ విడిచి క్షణమైన నుండువాడవు కావే? తద్వియోగమిప్పు డెట్లు సైచితివి? ఆస్నేహమంతయు నేమయిపోయినది? నీవట్టి వైరాగ్యము బూనుటకుఁ గారణమేమి? అయ్యయ్యో! ఎంతవచ్చినది? ఏమిచేతును? పుత్రా! యని యీరీతి పెక్కు తెరంగలఁబుత్రశోకంబున విలపించుచున్న మనోరమ గంఠధ్వని విని యతండు విహ్వలుఁడై మూర్చవోయి యంతలో దెప్పిరిల్లి క్రమంబునఁ దండ్రియొద్దకుఁబోయి యతనిం జూచుటకు సిగ్గుపడుచుఁ దలవంచుకొని నమస్కరింపుచు దూరముగాఁ గూర్చుండెను.

ఆ రాజు పుత్రుం జూచి బాష్పగద్గదస్వరుండయి వత్సా! చంద్రాపీడ! నీకు వైశంపాయనునియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతియని యెఱుంగుదును కాని యతనివృత్తాంతము వినినది మొదలు నాహృదయము నీయెడ ననుమానము జెందుచున్నదేమని పలికిన విని యతనిమాట లాక్షేపించుచు శుకనాశుం డిట్లనియె.

దేవా! అగ్ని చల్లబడినదనినను సూర్యుని నంధకారము గ్రమ్మినదనినను సముద్రమింకినదనినను నమ్మవచ్చును కాని చంద్రాపీడుఁ డట్టి దోషమును జేయునని తలంపరాదు. కృతయుగావతారమని చెప్పనోపిన చంద్రాపీడుని సుగుణముల విమర్షింపక మిత్రఘాతకునిగా సూచించితిరేల ? విచారింప వైశంపాయనుఁడే దుర్జనుఁడని తలంచెదను. లోకంబునఁ బుత్రులంగనుట వంశవృద్దికొరకుఁగదా! తండ్రి యానతిఁబూనక నేనెట్లు వైరాగ్యమును బూనుదునని యించుకెంతయు వాని స్వాంతమునఁ బుట్టినదికాదే! అట్టి దుర్మార్గుని విషయమై దయదలపఁ నేటికి? వాడు పెంచిన చిలుకవలె దేవరచేఁ బోషింపఁబడి యంతయు మరచి యిప్పుడు కృతజ్ఞత దలంప విడిచివెళ్ళెనే? ఆత్మద్రోహము చేసిన వానితో మనకేమి? అప్పాపాత్ముని జననము మనకు శోకమునకే కారణమైనది. అని పలికి కన్నీరు నించుచు నిట్టూర్పులు నిగుడించెను.