పుట:కాశీమజిలీకథలు-05.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వచ్చి వారించుచు నీప్రాంత మందచ్ఛోదమను పుణ్యసరస్సుగలదు. అందు దీర్ధమాడి శంభునర్చించి రేపుపోవుదము. ఈ పుణ్యభూమి కెప్పుడైనను వత్తుమా? యని పలుకుచుఁ బదగమనముననే తా నయ్యచ్ఛోదమునకుఁబోయెను.

ఆ ప్రదేశమంతయు రమణీయముగా నుండుటచే నందందు దృష్టి బరగింపుచు నందందు మెలంగుచు నవ్వనవిశేషములఁజూడఁ గ్రుమ్మరు చున్నంత నత్తటాకప్రాంతమున మణిశిలామంటప మొండు గనంబడినది.

దానిని జిరకాలమునకు గనఁబడిన సోదరునివలెఁ బుత్రకునిభాతి మిత్రునిచందమున నత్యంతప్రీతితో రెప్పవాల్పక చూచుచు స్థంభితుని యట్ల కదలక నిర్వికారహృదయుఁడై యెద్దియో ధ్యానించుచు నధోముఖముగా నందుఁ గూర్చుండుటయు మే మతనింజూచి మనోహరప్రదేశాలోకంబునం జేసి తదీయచిత్త మట్లు వికృతి బొందినదని తలంచి కొంతసే పూరకొంటిమి.

ఎప్పటికిని రాకున్న మేము దాపునకుఁబోయి ఆర్యా! వేళ యతిక్రమించుచున్నది. స్నానము చేయుము. పయనమునకు సైనికులు మీరాక వేచియున్నారు. ఈ ప్రదేశ మెంతసేపు చూచినను జూడవలయు ననియే యుండును. ఆలస్యము చేయక లెండని పలికిన మామాటలు వినిపించుకొనక కదలక మాకేమియుఁ బ్రత్యుత్తరము జెప్పఁడయ్యెను. ఆ లతామంటపమును మాత్రము రెప్పవేయక నిశ్చలదృష్టితోఁ జూచుచుండెను.

పలుమారు మేము తొందరపెట్టుటయు నెట్టకేలకు మమ్ము జూడకయే "నేను రాను. మీరిందుండరాదు. అతండరిగి పెద్దతడవయినది. వేగమ పొండని" పలుకగా విని అయ్యో! యీతం డకారణముగా వైరాగ్యమును జెందెనే! యని శంకించు కొనుచు సానునయముగా బోధించియు నిష్టురముగాఁ బలికియు నీకీ మోహము తగదు. వడిగా రమ్ము చంద్రాపీడుఁడు నిన్ను విడిచి వచ్చిన మమ్ము దండించునని యెన్నియో రీతులం జెప్పిన నెట్టకేలకు విలక్షణహాసయుక్తమగు మొగముతో మా కిట్లనియె.

ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది. నన్ను మాటిమాటికి గమనమునకు మీరు బోధన చేయుచున్నారు. నేను చంద్రాపీడుని విడిచి యెప్పుడైన నుంటినా? అంతయు నాకెఱుక యగుచున్నది. కాని నేనేమియుం జేయలేను. తెలిసినను జేయుటకు శక్తుఁడకాకుంటిని. చూచుచున్నను నాదృష్టి మరియొక చోటికిఁ బ్రసరింపదు. పాదములు గదలవు. ఇచ్చట స్థాపనజేయఁబడినదివోలె నాతనువు కదలకున్నది. కావున నేను వచ్చుటకు సమర్ధుఁడనుకాను. నన్నొకవేళ మీరు బలాత్కారముగాఁ దీసికొనిపోయెదరేని నామేనఁ బ్రాణములు నిలువవని తోచుచున్నది. ఇచ్చటనే యుండినచో నాహృదయంబున నెట్లో యున్నది. ప్రాణములు ధరింతునని ధైర్యమున్నది. కావున మీరు నన్ను నిర్బంధింపకుఁడు. మీరు వోయి యావజ్జీవము చంద్రాపీడముఖదర్శనసుఖం బనుభవింపుఁడు నా కట్టిసుఖము లేకుండ దైవము విడదీసెనని పలికిన మే మడలుచు నది కై