పుట:కాశీమజిలీకథలు-05.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

309

స్కంధావారమును ప్రవేశించినతోడనే గుర్రముపై నుండియే యత్యాతురముతో వైశంపాయనుఁ డెచ్చట నున్నవాఁడని యడిగెను. ఆ మాట విని యందున్న స్త్రీలు కొందరెద్దియో పని తొందరలో నుండి యతని గురుతుపట్టఁజాలక కన్నీరు విడుచుచు అయ్యో! ఇంకెక్కడి వైశంపాయనుఁడు? అతని నడిగెద రేమిటి కని పలికిరి.

ఆ మాటలు విని ఆ! పాపులారా! అట్లనియెదరేల? యని హృదయంబు ఝల్లుమన వారినదలించుచు మరియొకరి నడుగక భయపడుచు గుంపువీడిన లేడిపిల్లవలె బెదరుచు నేమియుంజూడక యేమియు మాటాడక యేమియును వినక యెవ్వరింజీరక హా! యిప్పుడు నేనెక్కడనుంటిని? యెక్కడికి వచ్చితిని? యేమిటికి వచ్చితిని? యెక్కడికిఁ బోవలయును? యేమి చేయవలయును? అని తలంచుచు నంధునివలె మూకునిపగిది జడునిభాతి నందుఁ గ్రమ్మరుచుండెను.

అప్పుడు తురగమును గురుతుపట్టి రాజకుమారులు చంద్రాపీడుఁడు చంద్రాపీడుఁడని పిలుచుకొనుచుఁ దొందరగా నతనిం జుట్టుకొనుటయు నతండు వారిని వైశంపాయనుఁడెక్కడ నున్న వాఁడని గద్గదస్వరముతో నడిగెను. వారు దేవా! సర్వము నివేదింతుము. గుర్రము దిగి యీ వృక్షచ్ఛాయను విశ్రమింపుడని దీనముఖులై పలుకుటయు నట్లుచేసి తదీయవాగ్ధోరణిం గనిపెట్టి యతండు చిత్తము విభ్రాంతి వహింపఁ బెక్కుతెరంగులఁ దలచుచు నపరాధము చేసినవాడుంబోలెఁ దల వాల్చుకొని మెల్లగా వానితో నిట్లనియె

నేను పోయిన వెనుక దారిలో సంగ్రామము తటస్థించినదా? లేక శీఘ్రములో నసువుల గ్రసియించు వ్యాధియెద్దియేని వచ్చినదా? పిడుగు పడినట్లు వైశంపాయనుని కింత యుపద్రవ మేల రావలయును? వేగమ చెప్పుడనుటయు వారందరు చెవులు మూసికొని శివశివా! అట్లనియెదరేల? పాపము వైశంపాయనుండు జీవించియే యున్నవాఁడు. ఇంక నూరేండ్లు బ్రతుకునని పలుకగా విని యారాజనందనుండు డెందంబానంద సాగరంబునమునుంగవారిఁగంఠగ్రహణముజేయుచు వెండియునిట్లనియె.

వైశంపాయనుండు బ్రతికియుండిన నాయాజ్ఞమీరి మఱియొక చోటికిఁ బోవువాఁడు కాడని యట్లంటి మంచిమాట జెప్పితిరి అతండిప్పు డెచ్చటికిఁ బోయెను? ఇచ్చటి కేల రాడు? అతని విడిచి మీ రేమిటికి వచ్చితిరి? వినువరకు నాచిత్త ముత్తలమందుచున్నది. వేగమ చెప్పుఁడని యుడిగిన నమస్కరించుచు వారిట్లు చెప్పఁదొడంగిరి.

వైశంపాయనుని కథ

దేవా! యవధరింపుము. వైశంపాయనునితోఁగూడ మీరు మెల్లగా రండని మాకు జెప్పి దేవర యరిగితిరిగదా! ఆ దినము మేము ప్రయాణసాధనముల సవరించుకొని మరునాఁడుదయంబునఁ బ్రయాణభేరిని గొట్టించి నంతలో వైశంపాయనుండు