పుట:కాశీమజిలీకథలు-05.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సఖీ! నీవు దారిలో మద్వియోగపీడచేఁ గుందుచు శరీరసంస్కార ముపేక్ష జేయుదువు సుమీ! సమయమున కాహారమును గుడుచుచుఁ దెలియనిదారిం బోవక విమర్శించి బస జేయుచుండవలయును. ఏమి జేయుదును? నీ కంటెఁ గాదంబరీప్రాణములు ప్రియములని నిన్నొంటిగాఁ బంపుచున్నాను. నా ప్రాణములు నీ చేతిలో నున్నవి కావున నీ యాత్మ జాగరూకతతోఁ గాపాడికొనుమని పలుకుచు నాలింగనము జేసికొని కేయూరకుని కప్పగించి నన్ను వెండియు మహాశ్వేతాశ్రమములో గలిసికొన వలయునని యుపదేశించి వారినంపెను.

వారు వోయిన వెనుక నితండు వీరు వేగముగా నందుఁ బోవుదురా? దారిలో నేదియైన యంతరాయము రాదుగదా! ఎన్ని దినములకుఁ బోయి యామె నూరడింతురు? అని యాలోచించుచు శూన్యహృదయుండై క్షణమందు వసించి స్కంధావార మెంత దూరమెందున్నదియో తెలిసికొని రమ్మని వార్తాహరునిఁ బంపి వైశంపాయను నెదుర్కొనుటకుఁ బంపుమని యాచించుటకై తండ్రిగారి యొద్ద కరిగెను.

దూరమందె నమస్కరించుచున్న పుత్రుంజూచి తారాపీడుఁడు నిబ్బరస్నేహగర్భమగు స్వరంబున వత్సా! రమ్ము, రమ్ము, అని చేతులు సాచుచుఁ గౌగలించుకొని దాపునఁ గూర్చుండఁబెట్టికొని ప్రత్యవయవము పాణిచే స్పృశించుచు దాపుననున్న మంత్రి ముఖ్యునితో నిట్లనియె.

ఆర్యా! శుకనాస! ఆయుష్మంతుఁడగు చంద్రాపీడునిం జూచితివా? ఇతని మేన యౌవనము పొడనూపినది. వివాహయోగ్యమగు దశ వహించియున్నవాఁడు. విలాసవతితో నాలోచించి వీనికిఁ దగిన రాజకన్యక నరసి పెండ్లి చేయవలయు ననుటయు శుకనాశుఁడు దేవా! దేవర లెస్సగా నాలోచించితిరి. ఇతడు విద్యలన్నియు గ్రహించెను. దిగ్విజయము చేసెను. ప్రజల కుత్సాహముగలుగఁజేసెను ఇఁక మిగిలిన కృత్యము పరిణయమే కదా! అవశ్యము దానిగురించి యాలోచింపవలయునని పలికెను.

అట్టి సమయమునఁ జంద్రాపీడుఁడు సిగ్గుచే తల వాల్చుకొని యాత్మగతంబున భళిరే! వీరి సంవాదము కాదంబరీసమాగమమునకు నుపశ్రుతివలెఁ దోచినది నా విషయమై మా తండ్రి కిప్పు డిట్టిబుద్ధి పుట్టుట సముద్రంబునఁ బడినవానికి యానపాత్రము దొరికినట్లుగా నున్నది. అని పెక్కుతెరంగుల నాలోచించుచు నంతలో వైశంపాయనుని ప్రస్తావన వచ్చుటయు నతని నెదుర్కొనుటకు ననుజ్ఞ యిమ్మని చంద్రాపీడుఁడు శుకనాసముఖముగాఁ దండ్రికి విజ్ఞాపన జేసికొనియెను.

తారాపీడుఁడు వైశంపాయను నెదుర్కొనుటకు బుత్రునకాజ్ఞ యిచ్చుటయు నతం డత్యంతసంతోషముతో నా రాత్రి వేగించి సుహృద్దర్శనలాంసుండై వేగుజాముననే లేచి ప్రాతఃకాలకృత్యముల నిర్వర్తించి యుచితపరివారముతో నింద్రాయుధ మెక్కి యతివేగముగా సేనాముఖమునకుఁ బోయెను.