పుట:కాశీమజిలీకథలు-05.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పలుకుచుఁ గన్నులు మూసికొని మూర్ఛయావేశింపఁ గాదంబరిని ధ్యానించుచున్నవాఁడుం బోలె ముహూర్తకాలము మేనెఱుంగక యంతలో దెలిసి గద్గదాక్షరముగా నతని కిట్లనియె.

కేయూరకా! పత్రలేఖవలననే కాదంబరీసంతాపమంతయుఁ దెలిసినది. నేనేమి చేయుదును? కాదంబరియొక్క యాజ్ఞనే నిందింపుము. అధరస్పందమాత్రముననే వియోగములను జేయుచున్న నా విషయమై యిన్నిచిక్కులు పడనేమిటికో విచారింపుము. ఆ యువతి లజ్జావతి యైచో బరిజనమునకంతఁ వ్యామోహ మేల? ఆ లలనకు మదనలేఖ రెండవ హృదయము కదా! తన్ముఖంబున నయినఁ దెలుపరాదా ?

అన్నన్నా! నిష్కారణము అమ్మదవతి మదనునిచేఁ బ్రాణసంకటము నొందుచున్నదే! ఇది యాముదితకుఁ బ్రారబ్ధముగా దలంచెను. కానిచో నేనశ్వముఖానుసారముగా దేవభూమి కెట్లు పోవుదును? పోయియు మహాశ్వేత నెట్లు కాంతును? కనియు మరలక హేమకూట మేటికిఁ బోవుదును? పోయియుఁ గాదంబరిం జూడనేల? చూచియు వితర్కింపక వ్యరథమనోరథుండనై యింత దూరమేలవత్తును? ఇది యంతయు దైవహతకుని కపటముకాని మఱియొకటికాదు. కావున వేగమపోయి యా యింతి నోదార్చుటకు యత్నింపవలయునని పలుకుచుండగా మార్తాండుం డపరగి శిఖర మదిష్టించి కిరణసహస్ర ముపసంహరించుకొనియెను.

అప్పుడు చంద్రాపీడుండు గేయూరకునితోఁగూడ దనమేడకుఁబోయి కాల్యకరణీయములం దీర్చి చంద్రోదయసమయంబునఁ జంద్రమణిశిలాతలంబున శయనించి కేయూరకుఁ డడుగు లొత్తుచుండ నతనితో, గేయూరకా! మనము పోవువరకుఁ గాదంబరి ప్రాణంబుల దాల్చియుండునా? మదనలేఖ యామె నోదార్చుచుండదు? మహాశ్వేత తద్వృత్తాంతమువిని వచ్చి ధైర్యము గరపకుండునా? హరిణశోభకాయతేక్షణమగు నమ్మగువ నెమ్మోము గ్రమ్మరఁ జూడఁగలుగుదునా? యని యడుగ నతఁడు దేవా? ధైర్య మవలంబింపుము. వెరవకుము వేగమ గమనయత్నము చేయుమని బలికెను.

అప్పు డతం డాత్మగతంబున అయ్యో! ఇప్పుడు మా తల్లిదండ్రుల కెఱింగింపక పోయితినేని వారు పుత్రశోకంబునం గుందుచు న న్నరయటకై వెడలి పుడమియంతయుం ద్రవ్వుదురే? అట్టివారిం గష్టపెట్టుట నాకేమి శ్రేయము? పోకున్నఁ గాదంబరి ప్రాణత్యాగము చేయును. ఱెండువిధంబులచేతఁ బ్రత్యపాయమే తోచుచున్నది. యేమి చేయుదును? ఎవ్వరితో చెప్పుదును? ప్రాణతుల్యుండగు వైశంపాయనుండైన దాపునలేడే! యని యనేక ప్రకారములఁ దలపోయుచు నారాత్రి నెట్టకేలకు గడిపెను.

అతండు మరునాఁడుదయంబున లేచి స్కంధావారము సమీపమునకు వచ్చి యున్నదనుట మాట వినియెను. అప్పుడు మిక్కిలి సంతసించుచు గేయూరకా! మన