పుట:కాశీమజిలీకథలు-05.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

305

యాలోచించి నిట్టూర్పు నిగుడించుచు విచారముతో లేచి తపంబుజేయుటకై వెండియుం దనయాశ్రమమునకుఁ బోయినది.

కాదంబరియు నీవార్త విని హృదయము బాదుకొనుచు నెత్తి మోదుకొనుచు మూర్ఛ మునింగి నేలంబడి యంతలో లేచి మహాశ్వేత యరిగిన విధమెరుంగక కన్నులం దెరచి శిరఃకంపముచేయుచుఁ గేయూరకా! యీ సంగతి మహాశ్వేతతోఁ జెప్పుమనియు మదనలేఖా! చంద్రాపీడుఁ డెట్టిపని చేసెనో చూచితివే! యిట్టివాఁ డెందేనిం గలడాయనియు సోపహాసముగాఁ బలుకుచు లేచి పరిజనులవిడిచి యొక్కతియ యేకాంతగృహమునకుఁ బోయి తల్పంబున మేనుజేర్చి ముసుఁగువైచుకొని మదనలేఖతో సైతము మాటాడక తత్పరితాపము లోపలనే యనుభవింపుచు నాదినము గడపినది.

అమ్మరునాఁడుదయమున నే నామె సమీపమున కేగినంత ఆహా! మీయట్టి యాప్తులు గలిగియున్నను, నేనిట్టి యుత్కృష్టకష్టములం జెందుచుంటినే యని యాక్షేపించునదియుంబోలెఁ బాష్పపూరోద్రేకముచేఁ బర్యాకులమగు దృష్టిచే నన్నట్టె చూచినది.

ఆ చూపులవలననే తదీయహృదయాభిప్రాయము గ్రహించి యామెతోఁ జెప్పకయే దేవరం జూడవచ్చితిని. మీనిమిత్త మామత్తపథబాకాశిని మిక్కిలి చిన్నది. ఆమె పడెడు నిడుములఁ జెప్పనలవి కాదు. అబలాజసముయొక్క హృదయము మృదువైనను ముక్తాఫలత్వము నొందిన జలమువలె నుత్కంఠితమయి కఠినమగునని తలంచెదను. కానిచో నామెచిత్తమెన్ని వ్యసనములు జెందినను నశింపకున్నది ఆహా! స్త్రీలకు వల్లభసమాగమాశ దురంతమయినదికదా! అట్టి కష్టములతోడ నయిన బ్రాణముల ధరించియున్నది.

రాజకుమారా! అత్యుత్కటమైన యాకలకంటి యుత్కంఠ నీతోనేమి చెప్పుదును? ఏ యుపాయంబునఁ బ్రదర్శింతును? దేనితోఁబోల్చి చెప్పుదును? ఆమె తాపంబు ప్రచండదినకరసహస్రాతపమును మించియున్నది. శయనముగా వేయబడిన పద్మపత్రము లెండి చూర్ణములైపోవుచున్నవి. కామునిచే మధింపఁబడు నా యాచేష్టలం జేయుచున్నది. వినుండు. మదనవేదన సహింపఁజాలక పరితపించుచుండ సఖులు కుసుమశయనంబునఁ బరుండఁబెట్టి కిసలయతాళవృంతముల వీచుచు సంతాపముచేఁ జూర్ణమైన యలక్తకరసంబున నెఱ్ఱఁబడిన శయనకుసుమంబులం జూచి కుసుమశరప్రహారజనితరక్తమని యడలుచుందురు. మీ పేరు తల పెట్టినంత మేనఁగవచమువలె రోమాంఛము వహించును. ఆమె యవస్థయంతయుం జెప్పుటకుఁ బదినములు పట్టును, పెక్కు లేల? అక్కడి కథలన్నియుఁ ద్వదాలాపముభరితములై యున్నవని యెఱింగించుటయుఁ జంద్రాపీడుఁడు కేయూరకా! చాలుచాలు. పైనఁ జెప్పకుము. వినలేకున్నానని