పుట:కాశీమజిలీకథలు-05.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

కాశీమజిలీకథలు - ఐదవభాగము

రమ్మని యాజ్ఞాపించుచున్నది. పత్రలేఖ దేశాంతరమునుండి వచ్చినదని విన్నదఁట వేగరండని విన్నవించుటయుఁ జంద్రాపీడుఁ డామాట విని అయ్యా! నా జీవితము సందేహడోల యెక్కి యూగుచున్నది. నా తల్లి నిమిషమైన నన్నుఁ జూడలేదు. కాదంబరి యవస్థ పత్రలేఖ యెరింగించినది. జననీస్నేహ మాజన్మక్రమాహిత మగుట బలమైనది.

పితృశుశ్రూషయు నట్టిదే. గంధర్వరాజసుతానురాగ మంతకన్న బలమైనది. జన్మభూమి విడువందగినదికాదు. కాదంబరియుఁ బరిగ్రహింపఁదగినది. ఇప్పు డేమి చేయుదును? అని యాలోచించుచు బత్రలేఖ చేయిపట్టుకొని తల్లియొద్దకుఁ బోయెను.

విలాసవతియు వారిం గారవించి మీరు నిత్య మొక్కసారి యెప్పుడో వచ్చి నాకన్నులంబడుచుండ వలయును లేనిచో నేనోఁపజాలనని పలుకుచు నాదివసమెల్ల దనయొద్ద నుంచుకొని యంపినది చంద్రాపీడుఁ డది మొదలు కాదంబరీవిరహవేదనాకులుండై మదనాగ్నిచే బాధింపఁబడుచు, శుష్కించిపోవుచు గడియ యొక్కయేఁడుగా గొన్ని దివసములు గడిపెను.

మరియొకనాఁ డతండు పత్రలేఖ వెంటరాఁ బాదచారియై బాహ్యోద్యానవనంబున కరిగి యందు విహరింపుచుండఁ గొండొకదూరములో విచిత్రగమనంబుల వారువమును నడిపించుచు వచ్చుచున్న యొకరౌతు నేత్రపర్వము గావించుటయు నతం డెవ్వఁడోచూచి రమ్మని యొకపరిచారకు నంపి తద్వార్త నరయుటకై యెదురుచూచుచుఁ బత్రలేఖా! అతఁడు గేయూరకుఁడువలెఁ గనంబడుచున్నాఁడు చూడుమని పలుకుచుండగఁనే యతండచ్చట కరుదెంచి గుఱ్ఱమును డిగ్గనురికి రాజపుత్రునికి నమస్కరించెను.

చంద్రాపీడుఁడు ప్రీతిచేఁ జేతులుసాచి రమ్ము రమ్ము. అని పలుకుచు నతని గాఢాలింగనము జేసికొని కేయూరకా! నీదర్శనముచేతనే కాదంబరి సేమముగా నున్నదని తెలియఁబడుచున్నది నీ యాగమనకారణము విశ్రాంతి వహించి యెరింగింతువుగాక! అని పలుకుచుఁ బత్రలేఖా కేయూరకులతోఁగూడ నొక యేనుఁగ నెక్కి నిజభవనంబునకుం బోయెను.

లోపలి కెవ్వరిని రానీయవలదని ద్వారపాలురకు నియమించి పత్రలేఖా కేయూరకులతోఁగూడ గృహారామము లోనికిం బోయి యందున్న పరిజనులఁ దూరముగాఁ బొమ్మని రాజపుత్రుండు కేయూరకుని కిట్లనియె. గంధర్వపుత్రా! కాదంబరి యొక్కయు మహాశ్వేత యొక్కయు మదనలేఖయొక్కయు సందేశమేమియో యెరుంగ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

రాజపుత్రా! అచ్చటి విశేషములు వినుము? బత్రలేఖను దీసికొనివచ్చి మేఘనాథుని కప్పగించి తిరుగాఁపోయి దేవరయొక్క యుజ్జయినీగమనవృత్తాంతము చెప్పి మీయుత్తరము చేతికిచ్చితిని. అది చదివి మహాశ్వేత తలయెత్తి యెద్దియో