పుట:కాశీమజిలీకథలు-05.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

303

సంకీర్తనముచేత నిషాపహరణ మంత్రంబున సర్పదష్టుండువోలె గన్నులందెరచి స్పృహతో నన్నుఁ జూచుచు నెవ్వరక్కడనని బరిజనమును బిలిచినది. అప్పుడు పెక్కండ్రు జవరాండ్రు ఏమియాజ్ఞ అని పరుగెత్తుకొని వచ్చిరి. వారియందుఁ జూపుల వ్యాపింపఁ జేయుచు మరకతశిలాతలమున గూర్చుండి నాకిట్లనియె.

పత్రలేఖా! ఇది ప్రియమని చెప్పుటకాదు నీరాక జూచుచుఁ బ్రాణముల ధరించి యుండెదను శీఘ్రముగాఁ గార్యము సాధించుకొని రమ్మని పలుకుచు నాహారము నా మెడలోవైచి తాంబూలాంబరాభరణాదు లొసంగి నన్నుఁ బంపినది. అని చెప్ప పత్రలేఖ యించుక తల వంచుకొని వెండియు నిట్లనియె.

దేవా! సూతనమగు కాదంబరి ప్రసాదాతిశయంబునం గలిగిన ప్రాగల్భ్యము చేత దుఃఖించుచు విజ్ఞాపన జేయుచున్నదాన. దేవరకు సైత మట్టియవస్థలో నున్న గంధర్వరాజపుత్రిక నుపేక్షించి వచ్చుట యుచితముకాదు. అపన్నవత్సలులగు మీరు తగనికార్యము జేసితిరి. అని యాక్షేపించుటయుఁ జంద్రాపీడుఁడు లలితమైనను బ్రౌఢమైన తదాలాప మాలించి రెప్పవేయక ఇంచుక యాలోచించి భాష్పోపప్లుతనేత్రుఁడై స్వభావధీరుండైనను వ్యాకులచిత్తుండై బాష్పనిక్షేపంబునఁ వ్యాకులమైన యక్షరములు గలుగునట్లుగాఁ బెద్ద యెలుంగున నిట్లనియె.

పత్రలేఖా! నేనేమిజేయుదును? శృంగారలీలల నుపదేశించెడు చెడుగు పచ్చవిల్తునిమూలమున నామచ్చెకంటి తన హృదయంబునఁ బొడమిన వికారముల నాకుఁ దెల్లముగా నివేదించినదికాదు. దేవతాస్త్రీలయొక్క రూపానురూపలీలాసంభావనాదు లదృష్టపూర్వము లగుట నదియంతయు సహజానురాగ మేమో యని సందేహడోలిక యెక్కి యూగుచు నాప్రేయసిం విరహాగ్నిపాలు సేసి నీచే నిందింపనిట్లుఁ బడితిని.

మరియు నాకీ మనోవ్యామోహము గలుగుట శాపదోషమేమో యని యాలోచించుచుంటిని కానిచో నాచిన్నది యతిస్ఫుటముగా మదనచిహ్నములఁ బ్రకటింపుచుండ నేనెందులకుఁ దెలిసికొనలేక పోయితిని? నాబుద్ధి సురిగిపోయినది పోనిమ్ము! స్మితావలోకనలీలావిశేషము లతిసూక్ష్మములగుటఁ దెలిసికొనుట కష్టము. మరియొక కారణము వలనం బుట్టుచుండును.

చిరకాలమునుండి తన కంఠమందున్న రత్నహారము నూరక నా మెడ యందువైచునా? అప్పుడైనం దెలిసికొనరాదా? అదియునుం గాక హిమగృహకథావృత్తాంతము నీవుగూడఁ జూచినదేగదా! అప్పుడైనఁ బ్రణయకోపమునం గాబోలు శ్లేషగానే పలికినది కాని స్పష్టముగాఁ జెప్పినదికాదు. అదియంతయు నామెదోషమే కాని నాది కాదు.

పత్రలేఖా! ఇప్పుడు గతమునకు వగచినఁ బ్రయోజనములేదు. నా హృదయ మెట్లామెకుఁ దెలియునో యట్లు ప్రవర్తించువాఁడనని పలుకుచుండఁగనే ప్రతీహారి జనుదెంచి నమస్కరించుచు, దేవా! విలాసవతీ మహాదేవి పత్రలేఖతోఁగూడ మిమ్ము