పుట:కాశీమజిలీకథలు-05.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వరించిన సతుల నెందరం జెప్పను! నీమనంబునం బుట్టినతలంపు అనర్థమైనది కాదు. శాస్త్రసమ్మతమైనది. దేవీ! మరణోద్యోగమును విడువుము. నీ పాదములతోడు! వేగపోయి యాతనిం దీసికొనివచ్చెదను. నన్నుఁ బంపుమని పలికిన విని యక్కలికి ప్రీతిద్రవార్ద్రములగు చూపులచే నన్ను జూచుచు సిగ్గువిడిచి యుత్తరీయము సవరించుచు మెడనుండి ముక్తాహారమును దీసి చేతంబూని ప్రహర్షవివశయై యిట్లనియె.

నాతీ! నీ ప్రీతి నేనెంఱుంగుదును. శిరీషమృదుప్రకృతిగల కన్యకాజనమునకుఁ బ్రగల్భవాక్యము లెట్లువచ్చును. ఇప్పుడు నేనేమని చెప్పవలయునో నాకుఁ దెలియదు. నీవు నాకతిప్రియుండవైతివంటినేని పునరుక్తిదోషముకదా. నాకు నీయందనురాగ మెక్కుడనిన వేశ్యాలాపమగును. నీవులేక నేనుజీవింపననిన ననుభవవిరోధము. నన్ను మన్మథుఁడు పీడించుచున్నవాఁడనిన నాత్మదోషోపాలంభము. నన్ను బలాత్కారముగా హరించితివనిన బంధకీధాష్టక్యము. తప్పక రావలయుననిన సౌభాగ్యగర్వ మగును. నేన వచ్చుచున్నదాన వంటినేని స్త్రీచాపల్యముగదా అనన్యరక్తవనస్వభక్తినివేదనలాఘవదోషము వచ్చును. మదీయమరణంబున నాకు నీయందుఁగల ప్రీతినిఁ దెలిసికొనఁగలవు అనిన సంభావముగదా!

[1][ఇంతవరకు కాదంబరీ పూర్వభాగము ఇంతవరకే బాణకవి కవిత్వము]

కావున నేమన్నను దోషమే కనంబడుచున్నది. నాఁడు అంబరంబునఁ గళాధిజ్యోత్స్నావితానంబున దెసల వెదజల్లుచుఁ బ్రకాశింపుచుండఁ గ్రీడాపర్వతకనితంబంబు నందలి కాసారతటంబున శిలాపట్టణమునఁ బ్రకాశించు హిమగృహంబునఁ బుష్పశయ్యయందుఁ బండికొని యక్కుమారునిచేఁ జూడఁబడితిని. రెండుసారులువచ్చి నాయవస్థ యంతయుం జూచి యుపేక్ష జేసిపోయెనే? ప్రియసఖీ! నీతో నేమందును? కూర్చున్నను, దిరుగుచున్నను, నిద్రించుచున్నను, మేల్కొన్నను, రాత్రింబగ లాశ్రీమంటపమున నాయుద్యానవనమున నాలీలాదర్ఘిక యందుఁ గ్రీడాపర్వతమం దా కుమారునిఁ జూచుచునే యుంటి. నా మాటయే నీకుఁ జెప్పుచుంటిఁ దదానయనకథతో నిఁకఁజాలు. ఎక్క డి రాక. అని పలికి యక్కలికి శోకవేగంబున భుజలతలయందు శిరమువంచి మూర్ఛవోయినదివోలె నూరకున్నది.

నేనామాట విని ఆహా! వియోగులు జీవించుట కష్టముగదా! సంకల్పమయుండగు ప్రియుండు గులాంగనల బాధించును. సంకల్పక్రీడలతోఁ బొద్దుపుత్తురు. అని నేను దలంచుచుండఁగనే సూర్యాస్తమయమైనది. అప్పుడు బాలికలు పెక్కండ్రు వచ్చి వింతవింతగాఁ దీపములు వెలిగించిరి. నేనామెం జూచి దేవీ! నీవు దుఃఖింపకుము. నేను వేగమ పోయి యారాజకుమారునిఁ దీసికొని వచ్చెదనని పలికినంత భవదీయ నామ

  1. ఇంతవరకు రచించి బాణకవి స్వర్గస్థుఁడయ్యెను. తరువాతఁ జివరకు నతని కుమారుఁడు రచించెను.