పుట:కాశీమజిలీకథలు-05.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మేమియని యడిగిన విని యానృపాలుండు, స్వామీ! నీ యనుగ్రహంబునఁ గృతి సంతతిచేఁ గృతార్థుండనైతిని. పుత్త్రునొక్కని దయసేయుఁడని కోరికొనియెను. అప్పుడు శంకరుఁడు, రాజా నీవు తెచ్చిన ధనము మాకవసరములేదు. ఈ యగ్రహార బ్రాహ్మణులకుఁ బంచిపెట్టుము సుపుత్త్రుఁ డదయించు నని పలికి రహస్యముగాఁ బుత్రేష్టిగావింపుమని బోధించి తద్విధాన మంతయు నెఱింగించెను. పిమ్మట రాజశేఖరుండు తదుక్త ప్రకారము ధనము బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి యింటికింజని పుత్త్రకామేష్టిఁ గావించి సుపుత్త్రుఁబడసెను మహాత్ముల యనుగ్రహమూరకపోవునా? అట్లు నిరూపమాన కళాపరిపూర్ణుండగు నవ్వటుచంద్రుఁడు పెక్కండ్రనాత్మాయత్తులైన ఛాత్రో త్తములు నధిక విద్యాప్రదానంబున ననవద్యులంగావించెను. విద్వజ్జనపరిసేవితుండగు శంకరుండు సర్వార్ధ తత్వములం దెలిసినవాఁడయ్యెను. శాస్త్రోక్తమగు భక్తిచేఁ దల్లికి నుపచారములం గావింపుచుఁ గొన్నిదినములు గడపెను.

చ. శరణముతల్లి కాసుమతి చంద్రుఁడురక్షకమావధూటిశం
    కరునకువారలొండొంరులఁ గానక తాళరొకింతసే పహా !
    వరమతినైననాతఁడు వివాహముసేసికొనందలంపఁడౌ
    నరుదగు మేరువెక్కి యెవఁడైననుగోరునె దుష్ప్రదేశమున్. 21

చ. సకలకలా ప్రవీణుఁడగు శంకరునిస్మఱిగేస్తు జేయ ను
    త్సుకమతువై తదాప్తులు యశోమహితప్రధితంబులైనవి
    ప్రకులములంగళామతిని రాజితరూపగుణాభిధన్యఁ గ
    న్యక వెదుకందొడంగిరి నియంత్రితులై సతిచేమిధోగతిన్. 22

శంకరునియొద్దకు మహర్షులు వచ్చుట

మఱియొకనాఁడు బృందారక పరివృత్తుడగు బృహస్పతి వోలె శిష్యగణసేవ్య మానుండై విద్యావ్యాసంగము చేయునున్న శంకరుని మందిరమునకు నుపమన్యు దధీచి గౌతమాగస్త్య ప్రముఖులగు తపోధనులు విచ్చేయుటయు దూరమునం దతండు వారిఁజూచి లేచి శిష్యగణముతోఁగూడ నెదురేగి యాతిథ్యంబిచ్చి యుచితసపర్యలం గావించి పీఠంబుల సుఖోపవిష్టులంగావించి యంజలి ఘటియింపుచు వినయంబున స్వాగతమడిగిన నమ్మహర్షులాదరపూర్వకముగా నిట్లనిరి.

మహాత్మా! నీవు సుకరమైనమతముల నుద్ధరింప నవతరించిన శంకరుండవు. నీ వచ్చిన కార్యము మరచి మాతృ సేవకుఁజిక్కి యిల్లు విడకున్నవాఁడవు ఇటుపిమ్మట నైనఁ గర్తవ్యాంశ మేమరక సుమీ యని పలుకుచుఁ గొంత సేపు రహస్యకథావిశేషంబుల ముచ్చటించిరి.