పుట:కాశీమజిలీకథలు-05.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

295

శ్వేతయొక్క పాదసేవవలనఁ గలిగిన ఫలమని పలుకుచు నావస్తువుల నాదరముతో గ్రహించి వామకరంబున నతని భుజము బట్టికొని రాజలోకమునెల్ల విడిచి మెల్లగా గంధమాదనమను నేనుఁగను జూడఁబోయెను. అందొకింతకాలము నిలిచి యటనుండి వాజిశాలకుఁబోయి యందలి గుఱ్ఱములఁ బరీక్షించుచు నింద్రాయుధపృష్ఠభాగము నందలి యవకుంఠనపటం బొకింత జారుటయు సవరించుచుఁ దన్ముఖంబున దృష్టినిరోధముగా వ్రేలాడుచున్న కేసరముల నెగదువ్వుచు నమ్మందిరదారుపునకుఁ జేరఁబడి కౌతుకముతో నిట్లనియె.

కేయూరకా! నేను వచ్చినతరువాత నయ్యంతఃపురమున యేమి జరిగినది? కాదంబరి యావాసరమెట్లు గడపినది? మహాశ్వేత యేమి జేసినది? మదనలేఖ యేమి భావించినది? నన్ను గురించి యంతఃపుర కాంతలెల్ల నేమి జెప్పికొనిరి? సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

దేవా! వినుండు దేవర యరిగినవెనుకఁ బరిజనముతోఁగూడఁ గాదంబరి సౌధమెక్కి తురగఖధూళిలేఖాధూసరమగు మీమార్గ మాలోకించుచు మీరు తిరోహితు లైనంత మదనలేఖయొక్క భుజంబున శిరంబిడి ప్రీతిచే నాదిగింతమునే చూచుచుఁ బెద్దతడవందే యున్నది. తరువాత నతికష్టమున నామేడ దిగి యాస్థానమంటపమున క్షణకాలము గూర్చుండి యంతలో లేచి మీరు నివసించిన క్రీడాపర్వతమున కరిగినది.

అందుఁ బరిజనులు రాజకుమారు డీలతామంటపమున నీ చలవఱాతఁ గూర్చుండెను. నీమణిశిలయందున స్నానము గావించెను. నిందు నిందుధరు నారాధించె, నిందు భుజించె, నిందు శయనించెనని యెరింగింపుచుండ నాయాచిహ్నముల విలోకింపుచు నాపగలు గడిపినది సాయంకాలమున మహాశ్వేత బలవంతముసేయ నెట్టకే నాశైలశిలాపట్టణమున భుజించినదిఁ అంతలోఁ జంద్రోదయ మగుటయు శశికరంబులకుఁ గపోలములపైఁ గరంబు లడ్డము పెట్టుకొని కన్నులు మూసి యేదియో ధ్యానించుచు క్షణకాలమందుండి యంతలో లేచి శయ్యాగృహమున కేగి పడుకొనినది.

అది మొదలు ప్రబలమగు శిరోవేదనయు దాహరూపంబగు జ్వరంబును బాధింప నేదియో వ్యాధిచేఁ గొట్టికొనుచు నెట్టకే నారాత్రి వేగించినది. నేఁటియుదయంబు నన్నుఁజేరి మీ సేమము దెలిసికొనుటకై సోపాలంబముగా మీకడ కనిపినది. ఇవియే యక్కడివార్తలని యెరింగించిన నాలించి రాజనందనుఁడు తొందరగా నందుబోఁ దలంచి గుఱ్ఱము గుఱ్ఱమని కేక పెట్టెను. అప్పుడశ్వరక్షకుఁడు జీనుగట్టి యింద్రాయుధము నెదురబెట్టుటయు పత్రలేఖను వెనుకఁ గూర్చుండఁబెట్టుకొని వైశంపాయనుని స్కంధావారమున నుండ నియమించి వేరొక గుర్రమెక్కి కేయూరకుండు వెంటరా నాహయంబెక్కి యతిరయంబున నాహేమకూటమున కరిఁగి కాదంబరీభవనద్వారంబున గుర్రమునుదిగి పత్రలేఖ వెంట నడువ లోపలకుఁ బోవుచు నెదురుగా వచ్చుచున్న మరియొక గంధర్వకుమారునిఁ గాదంబరి యెందున్నదని యడిగెను.