పుట:కాశీమజిలీకథలు-05.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

కాశీమజిలీకథలు - ఐదవభాగము

శమము మీదుగా నచ్ఛోదసరస్స్తీరమున కరిగి యందుండి యింద్రాయుధ బురపుటానుసారముగా స్కంధావారమును జేరి గంధర్వకుమారుల నంపివేసెను.

తన్నుఁజూచి మ్రొక్కుచున్న రాజలోకమును మన్నించుచు నెదురువచ్చిన వైశంపాయనునిఁ గౌఁగలించుకొని పత్రలేఖ నాదరించి లోపలిభవనమును బ్రవేశించి యేకాంతముగాఁ బత్రలేఖ వినుచుండ వైశంపాయనునితోఁ దాను జూచివచ్చిన విశేషములన్నియుఁ జెప్పుచుఁ దత్కథాలాపముల తోడనే యారాత్రి సుఖముగా వెళ్ళించెను.

మఱునాఁ డుదయకాలమున రాజపుత్రుడు సభాభవన మలంకరించి కాదంబరినే ధ్యానించుచుండ నంతలో ద్వారపాలుని వెంటవచ్చుచున్న కేయూరకునిఁ జూచెను. అతఁడు దూరమునుండియే మౌళిచుంబిత ధరాతలుండై నమస్కారము గావించుటయుఁ రాజపుత్రుం డోహోహో! గంధర్వపుత్రా! రమ్ము. అని పలుకుచుఁ జేతులు సాచి గాఢాలింగనము జేసి తన సమీపమందే కూర్చుండఁ బెట్టికొని వత్సా! పరివారయుక్తముగాఁ గాదంబరి సుఖియైయున్నదా? మహాశ్వేతకు భద్రమా! అని యడిగిన నతం డిట్లనియె.

దేవా! అందరును సుఖులై యున్నారు. కాదంబరి యంజలి పట్టి దేవర నర్చించుచున్నది మహాశ్వేతయు కుశలవాక్యపూర్వకముగ నమస్కరించుచున్నది. మదనలేఖయుఁ దమాలికయుఁ బాదప్రణామపూర్వకముగా నారాధించుచున్నారు మఱియు మహాశ్వేత దేవరకిట్లు విన్నవింపుచున్నది. నీ వెవ్వరికిఁ జక్షుర్గోచరుఁడ వగుచుంటివో వారు ధన్యులు. నీ సమక్షమునఁ జంద్రకిరణములవలెఁ జల్లనైన నీగుణములు వియోగమం దుష్ణకరకిరణములై బాధించుచున్నవి. ఇందలి జనంబులు నిన్నటిదివసంబు నమృతోదయవాసరంబువలె స్మరించుచున్నారు. నీచే విడువబడిన యీగంధర్వరాజనగరంబు వినివృత్తమహోత్సవమైనదిగాఁ దోచుచున్నది. నన్ను సకలసంగపరిత్యాగురాలని యెరుంగుదువుగదా? అయిన నకారణబంధుఁడవగు నిన్నుఁ జూచుటకు నాహృదయ మిచ్చగించుచున్నది. అదియునుంగాక భవదీయస్మేరాననవిలాసముల స్మరించుచుఁ గాదంబరి యస్వస్థశరీరయైయున్నది. కావున బునర్దర్శనగౌరవంబున నామెను సన్మానింపఁగోరుచున్నాను. ఇట్టిసందేశ మనుచితమైనను నీసుజనత్వమే మాకిట్టి ప్రాగల్భ్యమును గలుగఁజేయుచున్నది. ఇదిగో కాదంబరి నీకర్పించిన శేషాహారమును దల్పంబున మరచిపోయితివి. దీనిఁ బంపితిఁ గైకొనవలయునని తదీయసందేశ మెరింగించుచుఁ గాదంబరిచే నంపఁబడిన బిసతంతువులచేఁ గట్టబడియున్న తామరాకు దొన్నె నతనియెదుట విప్పి యందభిజ్ఞానముగా నుంచఁబడిన యాకులును, బోకలును, కర్పూరమును మృగదామోదమనోహరంబగు చందనవిలేపనంబునం దీసి రాజకుమారున కర్పించెను.

అప్పుడు జంద్రాపీడుండును ఆహా? నా భాగ్యము పరిజనకథలయందైన స్మరింపఁదగని నన్నుఁ గాదంబరి మిక్కిలి గౌరవింపుచున్నది. ఇది యంతయు మహా