పుట:కాశీమజిలీకథలు-05.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

293

నతం డతిరయంబునం బోయి వచ్చి, నమస్కరించి, దేవా తెల్లని విభూతిరేఖలు ఫాలమునఁ గ్రాల జపమాలికలం ద్రిప్పుచుఁ బాశుపతవ్రతచారిణులై శాటీపటంబులం దాల్చియున్న పరివ్రాజికలును జటాజినమౌంజివల్కలాషాఢధారిణులైన తాపసులును సాక్షాన్మంత్రదేవతలవలె దేవతాస్తుతి శ్లోకములఁ బఠించుచు జుట్టునుం బరివేష్టింప మందరప్రాసాదముక్రింద నంగణసౌధవేదికయందుఁ గూర్చుండి దర్శనాగతులగు గంధర్వ బంధువృద్ధుల సన్మానింపుచు మహాశ్వేత కాదంబరితో ముచ్చటింపుచున్నదని యెరిగించెను.

పిమ్మట గేయూరకుఁడు మార్గ మెరిఁగింపఁ జంద్రాపీడుఁడు అంతఃపురవిశేషంబులం జూచుచుఁ గ్రమంబున మహాశ్వేతయొద్దకు బోయి నమస్కరింపుచు నావేదికయందే కూర్చుండి క్షణకాల మూరకొని మహాశ్వేత మొగంబు పరీక్షింపుచుఁ గపోలముల ప్రకాశించునట్లు మందహాసము గావించెను. అప్పుడు మహాశ్వేత యభిప్రాయము గ్రహించి కాదంబరి కిట్లనియె.

సఖీ! చంద్రకిరణములచేఁ జంద్రకాంతమణివలె నీకనులచే నార్ద్రీకృతహృదయుండై చంద్రాపీడుండు వెళ్ళ నిశ్చగించి నేమియు మాటాడజాలకున్నవాఁడు. ఇతని వృత్తాంతమేమియుం దెలియక రాజచక్రము తొట్రుపడుచుండును. దూరమందున్నను బద్మినీపద్మబాంధవులకుఁ బోలె బ్రళయపర్యంతము మీ యిరువురకు నీ ప్రీతి స్థిరమై యుండక మానదు. ఈ కుమారున కరుగుట కనుజ్ఞ యిమ్మని పలికిన విని కాదంబరి నెచ్చెలీ! బరిజనయుక్తముగా నీజన మీ కుమారునకు తన యంతరాత్మవలెనే స్వాధీనమై యుండ నిందుల కవరోధమేమి? అట్లే పోవచ్చునని పలుకుచు గంధర్వకుమారులం జేరి వీరిఁ స్కంధావారమును జేర్పుఁడని యాజ్ఞాపించినది.

అప్పుడు చంద్రాపీడుఁడు లేచి తొలుత మహాశ్వేతకు నమస్కరించి తరువాతఁ గాదంబరికి మ్రొక్కి ప్రేమపూరితమగు తదీయదృష్టి చేతను, మనసు చేతను గ్రహింపఁబడుచు దేవీ! ఏమందును? లోకమున బహుభాషకుల నాదరింపరుగదా? నన్నుఁ బరిజనకథలయందు స్మరింపుచుండవలయు నిదియే నా కోరిక యని పలికి యతం డయ్యంతఃపురము నుండి బయలుదేరెను.

అప్పుడు కాదంబరితక్క తక్కిన యంతఃపురకాంత లందరు తద్గుణగౌరవముచే నాకర్షింపబఁడి పరవశలై బహిర్ద్వారము వరకు నతని ననుగమించి యరిగిరి. అందరివలనను నామంత్రణము వడసి యతండు కేయూరకానీతమగు నింద్రాయుధమెక్కి గంధర్వకుమారులతోఁ గూడికొని నడుచుచున్న యతనికి హృదయమందే కాక యన్నికడలను గాదంబరి యున్నట్లు కనంబడుచుండెను. అతని మనంబు తన్మయంబగుటఁ బోవలదని వెనుకనుండి లాగుచున్నట్లును ముందడ్డము వచ్చినట్లును దోచుచుండెను. అట్టి విరహముతో నతండు క్రమంబున మహాశ్వేతా