పుట:కాశీమజిలీకథలు-05.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వేషంబున సాక్షాచ్చంద్రోదయ దేవతవలె నొప్పుచుఁ గాదంబరి మదనలేఖ చేయి పట్టుకొని మందగమనంబునఁ జనుదెంచి ప్రీతిపేశలత్వమునఁ బ్రకటింపుచుఁ బ్రాకృతురాలివలెఁ బరిజనోచితమగు క్షితితలంబున గూర్చుండెను.

వలదు. వలదు. అని మదనలేఖ బ్రతిమాలుకొనుచున్నను వినక చంద్రాపీడుఁడు తాను గూర్చున్న మరకతశిలావేదికిం దిగి యెదిగి యా ప్రాంతమున నేలనే కూరుచుండి మెల్లన నిట్లు నుపన్యసించెను.

దేవీ! దేవీ! దృష్టిపాతమాత్రమునకే సంతసించు దాసజనునివిషయమై సంభావణాదిప్రసాద మవసరము లేదు. అట్టి యనుగ్రహమే కలిగినచోఁ జెప్పదగిన దేమి? నిపుణముగా నాలోచించినిను నీ కిట్టి దయగలుగుటకు గుణలేశమైన నా యందున్నట్లు కనంబడదు. అభినవసేవకునిగూడ నిట్లు చూచుచున్నది నీ సుజనత్వ మతి సరళమైనది గదా? ఓహో! నీ వెవ్వనిఁ బనులకు నియోగింతువో వాఁడే ధన్యుఁడు. కనుసన్న జేసినంతనే పనులు గావించెడు భృత్యుని విషయమై నీ కిట్టి యాదర మేమిటికో తెలియదు. ఈ శరీరము పరోపకారమున కుపకరణమై యున్నది. జీవితము తృణముకన్నఁ దేలిక యగుచున్నది. నీ గౌరవమే కానుకగాఁ గోరి యరుదెంచిన మేమును, ఈ శరీరము ఈ జీవితము, ఈ యింద్రియములు, నీ యధీనములు. నీ ఇష్టము వచ్చిన పనికి నియోగింపుము. అని పలికిన విని మదనలేఖ యించుక నవ్వుచు నతని మాటల కడ్డమై యిట్లనియె. రాజపుత్రా! నీ వనినదే సత్యము కాని యతియంత్రణఁచే గాదంబరి ఖేదమును సిగ్గునుం బొందుచున్నది. ఎందుల కిట్లు పలికెదవు! నియమనము తక్క తక్కినవన్నియు నామె యంగీకరించుచున్నది. ఉపచారఫల్గువగు వచనంబుల నీ బాలికను సందేహడోలిక నెక్కించి యూపుచుంటివిగదా? అని పలుకుచు ప్రస్తావముగా మీ తండ్రి తారాపీడుం డెట్టివాఁడు. విలాసవతి యెట్టిది? మీ రాజధాని యుజ్జయిని యిక్కడి కెంతదూరమున నున్నది? మీరతపవర్ష మెట్లుగా నుండును? మర్త్యలోకవిశేషము లేపాటిరమణీయములని యడుగుటయు నతండు తదనుగుణ్యములగు మాటలచే సంతోషము గలుగఁజేసెను,

ఇట్లు కాదంబరి కొంతసే పందుండి కేయూరకునిఁ జంద్రాపీడుని సమీపమున విడిచి శయనసౌధంబునకుం బోయినది. చంద్రాపీడుండును గేయూరకుఁ డడుగు లొత్తుచుండఁ గాదంబరియొక్క నిరభిమానత్వ గంభీరత్వాభిరూపత్వాది గుణంబులును మహాశ్వేత యొక్క నిష్కారణవాత్సల్యము మదనలేఖయొక్క సౌజన్యము గంధర్వరాజలోకసమృద్ధి కింపురుషదేశరమ్యత్వమును మనసున విత్కరించుచు నామరకతశిలాతలపర్యంకమున శయనించి సుఖముగా నిద్రబోయెను.

మరునాఁ డరుణోదయంబున మేల్కాంచి రాజపుత్రుండు కాల్యకరణీయంబులం దీర్చికొని తాంబూలము చేతంపూని కేయూరకునితో నోయీ! నీవు పోయి మహాశ్వేత యెందున్నదో కాదంబరి యేమి చేయుచున్నదో చూచిరమ్మని పంచుటయు