పుట:కాశీమజిలీకథలు-05.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

291

మీవంటివా రితరదత్తాభరణభారము వహింపరు. కాని కాదంబరికిఁ బ్రియముగా దీనిం ధరింపవేడుచున్నాను. యిది తప్పుగా గణింతురేని మహాశ్వేతను నిందింపుఁడు. ఆమెయే యిట్లు చేయమని తరళికను గూఁడ బంపినది అని పలుకుచు మదనలేఖ యా హారమును మెరుపుమీదఁ దారాచక్రమునువలెఁ దద్వక్షస్థలమున సంఘటించినది.

అప్పుడు చంద్రాపీడుఁ డామాటలు విని వెరగుఁజెందుచు సబహుమానముగా నిట్లనియె. తరుణీమణీ? నీవు మంచి నిపుణురాలవు గదా? ప్రత్యుత్తరావకాశము లేకుండఁగనే యుపన్యసించితివి ముగ్ధురాలా? దీని స్వీకరించుటకు మానుటకు మే మెవ్వరము? ఆ కథ ఇదివరకే యస్తమించినది సౌజన్యశాలినునైన మీ గుణములచేత నీ జనుండు కొనఁబడియెను. మీ కిష్టమైన వ్యాపారములకు నియోగించుకొనుఁడు. మిక్కిలి దాక్షిణ్యము గల కాదంబరియొక్క సుగుణము లెవ్వానివశము జేసికొనికుండెడివని పలికి పెద్దతడ వప్పడఁతిని గురించిన కథలే చెప్పికొనుచు గొంతవడికి నమ్మదనలేఖ ననిపి వెండియుఁ గ్రీడాపర్వతశిఖర మధిష్టించెను.

కాదంబరియు మదనలేఖవలన నందు జరిగిన వృత్తాంతమంతయుం దెలిసికొని ఛత్రాచామరాదిచిహ్నముల నేమియుం బూనక తమాలికను మాత్రము వెంటబెట్టుకొని క్రమ్మర నా మేడయెక్కి యుదయగిరిగుతుండగు చంద్రునివలె నొప్పు నప్పురుషరత్నమును జూచి వివిధవిలాసతరంగితములగు విలోకవనములం నతని మనసు హరించినది.

ఆలింగన మొనరింపుమని సంజ్ఞచేయుదానివలె బవనచలితంబగు నంబరంబు సవరింపునెపంబున గుచంబుల రెండుచేతులం గప్పుచు స్మరశరవిధురాల నైతినని తెల్పు చందంబునఁ బుష్పంబుల విరజిమ్ముచు నమస్కరించు దానివలెఁ గేశపాశమునుండి పూవులలాగి దోసిటంబట్టుచు నీరీతి సాయంకాలమువరకు ననేకలీలలు ప్రకటించినది.

అంతలో నంబరమణి యపరాంబునిధిమగ్నుం డగుటయుఁ గాదంబరీహృదయరాగసాగరంబునంబోలె సంధ్యారాగంబున జీవలోకంబు బూరింతంబయ్యె. క్రమంబున దిఙ్ముఖంబులు నీలాయమానంబులై మెల్లమెల్లనఁ జీకటులు వ్యాపింప దొడంగినవి. అంతలోనే లాంచనఛలంబున శర్వరీభార్య నురంబునదాల్చి కుముదినులచే గృహీతపాదుండై ప్రత్యక్షంబైన చందంబున దిక్కులఁ బ్రకాశింపఁజేయుచు రోహిణీకళత్రుండు నేత్రపర్వము గావించెను.

కుసుమాయుధాధిరాజ్యైకాతప్రతుండై కుముదమిత్రుండు పండువెన్నెలలుఁ గాయుచుండ జంద్రాపీడుండు చందనరసప్రక్షాళితంబగు ముక్తామంటపమున వసించి యందలి వింతలంజూచుచు వెన్నెలల సేవించుచున్న సమయంబున గేయూరకుం డరుదెంచి రాజపుత్రా! కాదంబరి మీ దర్శనము జేయ వచ్చుచున్నదని విన్నవించుటయు నతండు సంభ్రమముతోఁ జూచుచుండఁ దత్కాలరమణీయంబగు