పుట:కాశీమజిలీకథలు-05.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

కాశీమజిలీకథలు - ఐదవభాగము

తద్వశములై పోయినవే? తెలిసికొంటి నా చపలునితో నాకేమియుం బనిలేదు. అని క్షణకాలము ధ్యానించి యంతలో మన్మథునిచేఁ బాణములతోఁగూడ నీధైర్యావలేప మపనయించెదఁ జూడుమని భయపెట్టబడినదివోలెఁ గ్రమ్మరఁ దనహృదయమ్ముఁ జంద్రాపీడాభిముఖమ్ము గావించి ప్రేమావేశంబునఁ బరవశురాలై యట్టెలేచి వాతాయనమునం గూర్చుండి యాక్రీడాపర్వతమునుఁ జూచుచుండెను.

చంద్రాపీడుండును రెండవ కాదంబరీ హృదయమువలె నొప్పుచున్న యమ్మణిమందిరము ప్రవేశించి యందు బహువిదోపధానములతో వెలయుచున్న కుథయందుఁ బడుకొని యథానిర్దిష్టస్థానోపవిష్టలై గంధర్వకన్యకలు సంగీతము బాడుచుండఁ గేయూరకునితొడపై యడుగులిడి దోలాయితచిత్తుఁడై యిట్లు తలంచెను. ఆహా! ఈ గంధర్వరాజపుత్రిక విలాసములు సకలలోకమనోహరములు. ఆరాధింపకయే ప్రసన్నుండై మకరధ్వజుండు నాకీ వైభవము గలుగఁజేసెను. అనురాగముఁతో గూడిన క్రేగంటిచూపులచే నన్నాచపలనేత్ర విలోకించుట, తచ్ఛరపాతంబునం గాదే? నేనామె మొగంబు జూచినప్పుడు చిరునగవుతో నాచూపులఁ దనపై వ్యాపింప జేసికొనుచున్నది.

మఱియు సిగ్గుచే వదన మవ్వలకుఁ దిప్పుకొనియుఁ బ్రతిబింబప్రవేశలోభంబున బోలెఁ గపోలదర్పణంబున నాకర్పించినది. నాకు దాంబూలమిచ్చి యలసినదివోలెఁ దమాలపల్లవమున వీచుకొన్నది. ఇదియంతయుంజూడ నాచేడియ నాయందు బద్ధానురాగయై యున్నట్లు తోచుచున్నది సందియము లేదని తలంచుచు నయ్యో! మానుష సులభమగు లఘుత్వము మిథ్యాసంకల్పసహస్రములచే నన్నిట్లాయాస పెట్టుచున్నది. యౌవనమదము వివేకమును హరించును. యూనుల దృష్టి తిమిరోపహతమై నల్పమునుగూడఁ బెద్దదానిగాఁ జూచును. ఆత్మగౌరవత రూపాభిమానముగల కులటవలె దన లోపము దెలిసికొనఁజాలదు. ఇంద్రజాల పింఛకవనె నాశ లేనిదానినైనను నట్లు తోపించును అని యాలోచించుచు నోహో! నే నిట్లు వృథగా మనసును ఖేదపెట్టుచుంటినేల? నిజముగా నీగజగామినికి నాయం దనురాగము గలిగెనేని మనోభవుఁడే యవిలంబముగాఁ దెలుపఁగలఁడు. నా సందియ మతఁడే తీర్పఁగలడని వితర్కించుచుఁ గొంతసేపు సంగీతవిద్యావినోదంబుల నలరారి యంతలో లేచి యుపవనాలోకనకౌతూహలచిత్తుండై క్రీడాపర్వతశిఖర మెక్కెను.

కాదంబరియు నారాజకుమారుం గాంచి అయ్యో! మహాశ్వేత యింకను రాలేదా? వచ్చుచున్నదేమో చూచెదం గాక యని యాగవాక్షమునుండి లేచి యనంగతప్తచితయై మేడపై కెక్కినది. అప్పుడు విరాళముగాఁ బరిజనులు కూడఁబోయి యెండదగలకుండఁ చతుర్దండయుక్తంబగు ఛత్రంబు బట్టిరి. కొందరు వింజామరలతో విసరుచుండి రప్పుడు.