పుట:కాశీమజిలీకథలు-05.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

287

చున్నాను. నేను వచ్చుదనుక నీతం డెందుండవలయునని యడిగిన నప్పడంతి స్త్రీల హృదయస్థానముల యందలి మనసున ననుకొని ప్రకాశముగా నిట్లనియె. సఖీ! నీవు నన్నిట్లడిగెదవేల? చూచినది మొదలు శరీరమునకు, భవనమునకు విభవమునకు నీతండే పరివృఢుండని తలంచుచుంటి ప్రియసఖి! హృదయమునకుఁ గాని యాయనకుఁ గాని యెందిష్టమో యందేయుండవచ్చునని చెప్పిన మహాశ్వేత యిట్లనియె.

సఖీ! అట్లయిన నీ మేడ సమీపమందున్న ప్రమదవనమునందలి క్రీడాపర్వతముఁ గట్టఁబడిన మణివేశ్మమందు నివసింపజేయుఁమని యుపదేశించి మహాశ్వేత గంధర్వసార్వభౌముం జూడఁబోయినది.

చంద్రాపీడుండును మహాశ్వేతతోడనే బయలుదేరి వీణావాదినులు వేణువాద్యనిపుణలు సంగీతవిద్యాపారంగతులగు గంధర్వకన్యకలు పెక్కండ్రు కాదంబరీసమాదిష్టలై తన్ననుసరించిరాఁ బూర్వపరచితుండగు కేయూరకుండు ముందు నడుచుచు మార్గము జూపుచుండ రెండవజయంతమువలె నొప్పుచున్న యమ్మణిమందిరమున కరిగెను.

పిమ్మటఁ గాదంబరియుఁ బరిజనములెల్ల విడిచి యొక్కరితయే మేడయెక్కి తల్పంబునం బడుకొని యాత్మీయంబులగు వినయముగ్ధతాకుమారభావకులమర్యాదాదివిశేషంబులం దలంచుకొని యగ్గలంబగు సిగ్గు జెందుచు నిట్లు విచారించినది.

అయ్యో! మోహాంధురాలనై యిప్పుడు నే నెట్టిపని గావించితిని? అతం డదృష్టపూర్వుండు. కనబడఁగూడదని యించుకయు శంకింపనైతి. నన్ను లోకులు లఘుహృదయనుగాఁ దలంతురని నిర్లజ్జనై యాకలింపనైతిని. గురుజనములకు వెరవక లోకాపవాదమునకు భయపడక మహాశ్వేత దుఃఖితయైయున్న దనుమాట యాలోచింపక పరిజనము జూచునని తెలియక నష్టచేతననై దష్టమగుపని కావించితిని. నా ప్రమాదము స్థూలబుద్ధులుగూడఁ జులకనగాఁ దెలిసికొనఁజాలదు రనిన నను భూతకందర్పవృత్తాంత యగు మహాశ్వేతయు సకలకళాకుశలలగు సఖురాండ్రును రాజకులసంచారచతురులగు పరిజనులును, గ్రహించుట యేమి యబ్బురము? అంతఃపురదాసు లిటువంటి పనులఁ దెలిసికొన నతినిపుణదృష్టి గలవారుగదా?

అన్నివిధముల నేనిప్పుడు భ్రష్టురాలనైతిని. నాకిప్పుడు మరణమే శ్రేయము. బ్రతుకుట లజ్జాకరము. ఈ వృత్తాంతము విని నా తలిదండ్రులేమందురో! ఏమి జేయుదును? ఇందులకుఁ బ్రతీకారమేది? ఏయుపాయమున నీస్ఖలితమును గప్పికొందును? నా యింద్రియచాపల్య మెవ్వరితోఁ జెప్పికొందును?

అయ్యయ్యో! నాసఖుల ముందరఁ బెండ్లియాడనని శపథముఁజేసి యా వార్త కేయూరకముఖముగా మహాశ్వేతకుఁ దెలియజేసితినే? ఆమాట యించుకయు జ్ఞాపకము లేకపోయినది. శఠవిధి యా చంద్రాపీడు నాకడ కేమిటికిఁ దీసికొనిరావలయును? అతఁ డెవ్వడు? ఎప్పుడైన జూచితినా? వింటినా? తలంచితినా?

వానిం జూచినంతనే నా యింద్రియము లన్నియు విత్తమిచ్చి కొనఁబడినట్లు