పుట:కాశీమజిలీకథలు-05.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

279

గీతాది కళాపరిచయము మా కొక్కచోటనే కలిగినది. ఆ రీతి మా యిరువురచేతను బాలభావము గడుపఁబడినది.

ఆ కాంత యిప్పుడు నా వృత్తాంతములు విని మిక్కిలి శోకించుచుఁ దానుగూడ నిట్లు శపథము చేసినది. నా వయస్యయైన మహాశ్వేత దుఃఖించియుండగా నేను బెండ్లియాడను. మా తండ్రి నాకు బలవంతముగా బెండ్లి చేసినచో రజ్జు, సర్ప, విష, పానకాదుల మృతినొందుదాననని సఖుల చెంతపల్కు పలుకులు కర్ణాక ర్ణికగా విని దాని తండ్రి చిత్రరథుఁడు మిక్కిలి పరితపించుచు నేకాపత్యుఁడగుటచే నేమియు దానిని మందలింపలేక వితర్కించి మరియొక యుపాయ మేమియుంగానక నా యొద్దకు క్షీరోదుఁడను కంచుకి నంపి వత్సా! మహాశ్వేత! నీ నెచ్చెలి కాదంబరి సంపూర్ణయౌవనయయ్యు వివాహమాడనని మూర్ఖము చేయుచున్నది. యెవ్వరు చెప్పినను వినకున్నది. నీ కన్న దాని చిత్తమును మరల్చువారు లేరు. ఎట్లైనను నీవీ కష్టమును మాకుఁ దొలగింపుమని నాకు వార్త నంపెను. నేనా వార్త విని గురువచనమందలి గౌరవముచేతను సఖురాలి యందలి మక్కువ చేతను "అయ్యో కాదంబరీ! దుఃఖించుచున్న నన్ను మిక్కిలి దుఃఖింపజేయుచున్నావేమి? నాకు సంతోషము గలుగజేయు తాత్పర్యము నీకుఁ గలిగియున్నచో నా మాట విని తండ్రిచెప్పిన చొప్పున నడువుము. ఇదియే నాకు బ్రియము"

అని నా మాటగా చెప్పమని తరళికను క్షీరోదుని వెంట నీ దినముననే యంపితిని. అది వెళ్ళిన కొంచెము సేపునకే దేవర దయచేసితిరని పలికి యూర కుండెను.

అంతలోఁ జంద్రోదయమైనది. అప్పుడు మహాశ్వేత వల్కలతల్పంబునం బరుండి నిద్రబోయినది. చంద్రాపీడుఁడును మనంబున అయ్యో! యిప్పుడు వైశంపాయనుఁ డేమి చేయుచుండునో నన్నుఁ గాన కెంత చింతించుచుండునో 'పత్రలేఖ యేమనుకొనునో' రాజపుత్రు లేమందురో యని ధ్యానించుచునే నిద్రబోయెను.

నిశావసానంబున మేల్కాంచి మహాశ్వేతయు నా రాజపుత్రుఁడును కాలకృత్యములు నిర్వర్తించిరి. ఇంతలో మనోహరమైన వేషముతో గేయూరకుండను గంధర్వకుమారునితో గూడఁ దరళిక యచ్చటికి వచ్చినది. ఆ ప్రాంతమందుఁ గూర్చునియున్న రాజపుత్రునింజూచి యాతరళిక విస్మయమందుచుఁ దదీయరూప మక్షులం గ్రోలుచున్నట్లు సవిత్కరముగా జూచిచూచి తల యూచుచుఁ బిమ్మట మహాశ్వేత యొద్దకుఁబోయి నమస్కరించి తదీయ జపావసానమువరకుఁ దాపున గూర్చుండెను.

మహాశ్వేతయు జపము ముగించినవెనుక తరళికంజూచి, బోటీ! కాదంబరి సుఖముగా నున్నదా? నామాటలం జెప్పితివా? యేమన్నది? సమ్మతించెనా? యని యడిగిన విని యవ్వనితయు వినయముతో శిరమువంచి, రాజపుత్రీ! నేను వోయి