పుట:కాశీమజిలీకథలు-05.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కాదంబరిని జూచితిని. ఆమె సుఖముగానున్నది. నీ సందేశమంతయు వినిపించితిని. కన్నీరు గార్చుచుఁ గేయూరకుఁడను తన వీణావాహకుని కెద్దియో చెప్పి యిచ్చటికంపినది. సర్వము నతండే నివేదించునని పలికి యూరకుండెను.

అప్పుడు కేయూరకుడు లేచి నమస్కరించుచు దేవీ? మా రాజపుత్రి నీ కిట్లు విజ్ఞాపనజేయుమని నన్నంపినది. వయస్యా! ఇప్పుడు తరళిక చెప్పిన మాటలన్నియు వింటిని. నాచిత్తమును బరీక్షించుటకో లేక గృహవాసాపరాధమును గురించి నిపుణముగా నధిక్షేపించుటయో స్నేహపరిత్యాగమో కాక కోపమో కాని యిట్టివార్త నంపుట నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది మిత్రురాలు చింతించుచు నటవిఁ గ్రుమ్మరుచు వ్రతముల గృశించి కష్టముల ననుభవింపుచుండ నాకు ఆహా! సుఖ మెట్లనుభవింప నగును? నిర్వృత్తి యెట్లు గలుగును? సంభోగమెట్లు రుచ్యమగును? పెక్కేల! నవ్వు సైతము వచ్చునా?

క్రూరుఁడగు మన్మథుఁడు నిన్నిట్టి యవస్థ నొందజేసెనే? అట్టి కాముని సకామునిగా నెట్లు చేయుదును? పద్మినులు దివసకరాస్తమయవిధురము లగుచుండ సహవాసపరిచయంబునం జేసి చక్రవాకయువతి సైతము సమాగమసుఖమును విడుచుచున్నదే? నీయందలి ప్రేముడిచే గుమాతిరాజస విరుద్ధమగు స్వాతంత్ర మంగీకరించితిని. గురువచనము తిరస్కరించితిని. లోకాపవాదము గణింపనైతిని. స్త్రీలకు మండన మగు సిగ్గు విడిచితిని. ఇప్పుడు తిరిగి యెట్లు స్వీకరింతును?

అంజలి ఘటించి ప్రార్ధించుచున్నదాన, నన్ననుగ్రహింపుము. నా జీవితముతోడనే నీవు వనములోఁ బ్రవేశించితివి. కోపము సేయక యీవిషయము నన్నెప్పుడు మందలింపవలదు. నా చిత్తము మరలదు. అని చెప్పి కేయూరకుఁ డూరకుండెను.

అతనిమాటలు విని మహాశ్వేత గొంచెము సేపాలోచించి తల యూచుచుఁ గానిమ్ము. కేయూరక! నీవు బొమ్ము. నేను వచ్చి పరిశీలించెదనని పలికి యతని నంపి చంద్రాపీడునింజూచి, రాజపుత్రా! కింపురుషరాజధానియైన హేమకూటమున కిప్పుడు బోవలసియున్నది. అదియు నిచ్చటికి దాపుగనే యుండును. అదృష్టపూర్వములకు పట్టణవిశేషములం జూడ వేడుక గలిగియున్నచోఁ జూచి వత్తువుకాని రమ్ము మద్విశిష్ట యగు కాదంబరిని సైతము చిత్తవిభ్రమమునుండి తొలగింపనగు నొక దివసమేయుండి పోవచ్చును. అకారణబంధుండవగు నిన్నుఁ జూచినది మొదలు నా హృదయపరితాప మొకింత తొలంగినది. సజ్జనసమాగమము శోకమును బోగొట్టును కదా! మీవంటివారు పరులకు సుఖము గలుగుటయే చింతించుచుందురని బలికిన విని చంద్రాపీడుఁ డచ్చేడియ కిట్లనియె.

భగవతీ! నిన్నుఁజూచినది మొదలు నాకును హృదయమున నెద్దియో యపూర్వమగు నుత్సాహము గలుగుచున్నది. నిశ్శంకముగాఁ గర్తవ్యములకు నిన్ను