పుట:కాశీమజిలీకథలు-05.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వివశనగుట నేమని విలపించితినో యేమయితినో యెఱుంగను. నామేనినుండి ప్రాణములు సైత మేమిటికిఁ బోయినవి కావో నాకుఁ దెలియదు. మరికొంతసేపటికి నాకుఁ దెలివి వచ్చినది. అప్పుడు నా దేహమును నగ్నియందు బడినట్లు అసహ్యశోకదహ్యమానమై నేలంబడి కొట్టుకొనుచుండఁ జూచితిని.

హా! యిదియేమి యుపద్రవము, ఇట్లు వచ్చినదని పెద్ద యెలుంగున హా! అంబ! హా! తాత! హా! సఖులారా! యని యరచుచు, హా నాథ! జీవితనిబంధన నన్నొంటిమై విడిచి యెక్కడికిఁ బోయితివో చెప్పుము నీనిమిత్త మెట్టియవస్థ ననుభవించితినో తరళిక నడుగుము, దివసమొక్కటియే సహస్రయుగప్రాయముగా గడిపితిని.

ఒక్కసారి మాటాడుము ? భక్తవత్సలత్వము జూపుము. నా మనోరథము పూరింపుము. భక్తురాల, ననురక్త, బాల, ననాథ, మదనపరిభూత, నిట్టి నాయం దేటికి దయసేయవు? నే నేమి యపరాధము చేసితిని? అయ్యో! నీవు నాకతంబున నెట్టియవస్థ బొందితివి. నా కీబ్రహ్మహత్యాపాతకం బెట్లు పోవును. నేను మహాపాతకురాలను. ఇట్టి నిన్ను విడిచి ఇంటికిఁ బోయితిని. ఇఁక నాకు దల్లిదండ్రులతోఁ బ్రయోజన మేమి? బంధువు లేమిటికి? దైవమా, న న్ననుగ్రహింపుము, వనదేవతలారా, అనాథను రక్షింపరా? తల్లీ! భూదేవి! లోకానుగ్రహకారిణి? నాయందు నీకైనం దయలేదా? యని యనేకప్రకారముల నేమియుం దెలియక గహావిష్టురాలి చందమునఁ బ్రేలుచు విలపింపఁ దొడంగితిని, మరియుఁ దచ్చరీరంబునంబడి కపోలములు ముట్టుచు జటాకలాపములు సవరించుచు హృదయంబున నిడిన నళినీదళంబులఁ దీసివేయుచు మాటిమాటికి మోము చుంబించుచు సారెసారెకు గంఠగ్రహణముచేయుచు, ఆర్యా! యీతనిం బ్రతికింపుమని కపింజలుని పాదంబులం బడుచు, దరళికం గౌఁగలించుకొనుచుఁ బెక్కుగతుల విలపించితిని.

అప్పుడు నా నోటనుండి అశ్రుతపూర్వములు ననుపదిష్టములు నగుచాటూక్తు లెన్నియేని వెడలినవి. తలంచుకొన నాకావిలాపవచనము లెట్లు వచ్చినవో నాకే చిత్రమగుచున్నది. అదియొక యవస్థగదా. జలయంత్రమువలె నశ్రుప్రవాహములు బయలు వెడలుచుండెను. నోటినుండి యంకురించుచున్నట్లు ప్రలాపములు వచ్చుచుండెను. అన్నన్నా! ఆ యవస్థ తలంచుకొనినంత మేను గంపము నొందుచున్నదని పలుకుచున్న యామహాశ్వేత చేతనము మూర్చ హరించినది.

తద్వేగంబునం బడుచున్న యామెను జంద్రాపీడుఁడు కరంబుల నాని పట్టుకొని యశ్రుజలములచేతఁ దడసిన తదుత్తరీయముచేతనే మెల్లగా వీచుచుఁ గొంతసేపునకుఁ దెలివివచ్చి కన్నులు దెరచిన యామెంజూచి దైన్యంబుదోప నిట్లనియె.

భగవతీ! నాకతంబున నీకీశోకము వెండియు దాపము గలుగఁ జేసినది. ఇఁక పైనఁ జెప్పకుము, విరమింపుము, నేను సైతము వినఁజాలకున్నాను. గతించిన వైనను సుహృజ్ఞనదుఃఖములు స్మరించినప్పుడు అనుభవసమమగు వేదన గలుగ