పుట:కాశీమజిలీకథలు-05.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

కాశీమజిలీకథలు - ఐదవభాగము

తదీయకిరణజాలంబులు చల్లనివైనను దాహజ్వరఖిన్నునిపై నిప్పులవర్షము గురిసినట్లు సంతాపము గలుఁగజేయ మూర్ఛపోతిని.

అప్పుడు తరళిక నన్నుఁ బలుమారు పిలిచి పలుకకుండుట గ్రహించి తొట్రువడుచు శైత్యోపచారము లెన్నియేని గావించినది అప్పుడు నాకించుక తెలివి వచ్చి కన్నులం దెరచితిని.

చందనపంకార్ద్రంబులగు కరంబులు జోడింపుచుఁ దరళిక నన్నుఁజూచి, దేవి! నీవిక సిగ్గుపడిన లాభములేదు. ధర్మమునకు వెరచితివేని ప్రమాదము రాక మానదు. నీ సంతాపమంతకన్న నెక్కుడగుచున్నది నా యందు దయయుంచి పుండరీకుఁడున్న చోటికిఁ పోవుదము లెమ్ము. తదీయబాహునాళములఁ బెనవైచినప్పుడు కాని నీ మేనికాక దగ్గదని వినయముగాఁ బలుకుచున్న తరళికంజూచి, ఓసీ! మదనుని మాట జెప్పనేల? ఇప్పుడీ శశాంకుఁడే ప్రాణములును హరింపుచున్నవాఁడు. అట్లే పోవుదము లెమ్ము అతిప్రయత్నముతోఁ బోయి హృదయవల్లభుని సంతోషపెట్టెదనని పలుకుచు మూర్ఛాఖేదవివశములగు నవయవములచే నెట్టకేలకుఁ దరళికం బట్టుకొని బయలుదేరితిని.

అట్టి సమయమున నాకుఁ గుడిక న్నదరినది. అయ్యో! దైవ మిది యేమి యిట్టిసూచన గావింపుచున్నాడు. మరియు నేమి చేయఁదలఁచుకొనెనోకదా యని శంకించుకొనుచుఁ బరిజనమునకు సైతము తెలియకుండ దాంబూలాంగరాగాదిసుగంధద్రవ్యములు గైకొని తరళిక వెంటరా నాపారిజాతమంజరియే ధరించి యామేడ వెడలి నీలపటావకుంఠనముతో రహస్యమార్గమున నయ్యచ్ఛోదసరస్సమీపవనమునకుఁ వచ్చుచుంటిమి.

ఆహా? అడుగు గదిపినఁ బెక్కండ్రుపరిచారికలు వెంట నడచి వచ్చుచుండ నేనట్లు తరళికాసహాయినినై పోవుచుండ నించుకయు వెరపులేకపోయినది. ప్రియునింగూర్చి యేకాంతముగా బయలువెడలువారికి నారోపితశరాసనుండై పుష్పబాణుండు సహాయముగా వచ్చుచుఁ బరిచరక్రియల నుపదేశింపుచుండునుగదా!

లజ్జను వెనుకకుఁ ద్రోసి నాకంటె ముందుగా నింద్రియములతోఁ గూడ హృదయము పరుగిడఁదొడంగినది. అప్పుడు నేను తరళికం జూచి, సకియా! యీ యిందుహతకుఁడు నన్నుఁబలె బుండరీకుని సైతము గరంబులంగట్టి యభిముఖముగా దీసికొని రాఁడుగదా! యని పలికిన నదియు నవ్వుచు, రాజపుత్రీ? నీవు ముద్దరాలవు సుమీ? ఇతని కతనితోఁ బ్రయోజనమేమి ? మదనాతురుండువోలె నీయందట్టి చేష్టలం గావింపుచున్నవాఁడు చూడుము. ప్రతిబింబకైతవంబున స్వేదకణికాంచితమగు నీకపోలముఁ జూపించుచున్నవాఁడు. లావణ్యభూయిష్టమగు కుచభారంబునం బడుచుండెను. కాంచీరత్నముల గరంబుల నంటుచుండె, నిదిగో నఖలగ్నమూర్తియై చరణంబులం బడుచున్నవాఁడు మఱియుం దాపంబున నతని మేను శుష్కచందనలేపపాండు