పుట:కాశీమజిలీకథలు-05.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నెవ్వనికిఁ గలిగియుండునో శుభాశుభవివేచన మెవ్వఁ డెరిఁగియుండునో వాఁ డుపదేశమునకుఁ దగినవాఁడు. నాకవి యన్నియును దవ్వైనవి. యుపదేశకాల మతిక్రమించినది. జ్ఞానము నిలుపుకొనుసమయము మించిపోయినది. నీకంటె నాకు సన్మార్గ ముపదేశించువాఁడు లేడు. నీయుపదేశము నేను వినఁదగినదే కాని నామానసవికారము మరలించుకొనుటకు శక్యము కాకున్నది. నేనేమి చేయుదును? మదనసంతాపముచే నాయంగము లన్నియు నుడికిపోవుచున్నవి. దీని కెద్దియేని ప్రతిక్రియ యెరుంగుదువేని యాచరించి నీ ప్రియమిత్రుని బ్రతికించుకొమ్మని పలికి యూరకుండెను.

అప్పుడు నేను మరల నతని మతిమరలింపఁదలంచి శాస్త్రదృష్టాంతముల నితిహాసనిదర్శనములు నగు మాటలచే నెంతేని నీతి నుపదేశించితిని కాని యతం డేమియుఁ జెవియొగ్గి వినకపోయెను.

ఇఁక నుపదేశములతోఁ బ్రయోజనములేదని నిశ్చయించి నేను లేచి యత్తటాకములోనికిఁబోయి తామరతూడులను, కమలినీదళములను, గలువలను, పద్మములనుం గోసికొనివచ్చి యందున్న లతామంటపమునందలి శిలాతలంబునం బాన్పుగా బరచి యతనినందు బరుండఁబెట్టి చందనతరుపల్లవంబులం దెచ్చి రసముతీసి స్వభావసురభియగు నారస మాపాదమస్తకముగా నతనిమేనం బూసి కదళీదళంబున వీచుచుంటి. మిక్కుటమగు తాపముచే నాచేయు శైత్యోపచారములన్నియు నిష్ఫలములగుచుండఁ జూచి నేనిట్లు తలంచితిని అన్నన్నా! మన్మథునికి సాధ్యముకానిది లేదుకదా! హరిణమువలెఁ గ్రుమ్మరుచు స్వభావముగ్దుడగు నీతండేడ? వివిధవిలాసరసరాశియగు గంధర్వరాజపుత్రి యేడ? యెట్లు సంఘటించెనో చూడుము సాగరగంభీరుఁడగు నితని దృణమువలెఁ దేలికపరచెనే? యింతకన్న ప్రౌఢిమ యేమిగలదు? అన్నిగతులచేతఁ దీర్పరాని యాపద తటస్థించినది ఏమిచేయుదును? ఎక్కడ జొత్తును? ఎవరితోఁ జెప్పుదును? యెట్లు వీని ప్రాణములు నిలుచును? ఉపాయ మెద్ది? కర్తవ్య మేమి? యని యనేకప్రకారములఁ దలంచుచు అయ్యో! యీవెర్రియాలోచనఁతోఁ బనియేమి? తత్కాంతాసమాగముకన్న వేరొకండుసాధనమున వీఁడు బ్రతుకఁడు అట్టిపనియే చేయఁదగినది. తాపసజనులకిది యనుచితమని నే నిప్పు డూరకుంటినేని యేకోచ్ఛ్వాసజీవితుండగు నితండు కాలమును సహింపక మృతినొందగలఁడు. గర్హితకృత్యముచేత నయినను మిత్రాసువుల రక్షింపఁదగినదికదా! కావున నే నిప్పు డన్నిగతులచేత నానాతియొద్దకుఁ పోవుటయే యుచితముగా నున్నయది. ఇతని యవస్థ యంతయు నాయింతి కెరింగించెదనని నిశ్చయించుకొనుచు నెన్నఁడును దుర్వృ త్తియందుఁ బ్రవేశింపని యతండు నన్నుఁ జూచి సిగ్గుతో నావృత్తి మరలించుకొనునేమో యని యెద్దియో మిషబన్ని యతనితోఁ జెప్పక యచ్చోటు బాసి నీయొద్దకు వచ్చితిని. తరువాత చేయందగినకృత్య మెద్దియో యాలోచింపుమని పలికి నా మొగంబునఁ జూట్కి నిలుపుచు నామాట విను తాత్పర్యముతో నూరకొనియెను.