పుట:కాశీమజిలీకథలు-05.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నేను దటాలున లేచి నమస్కరించి యాదరముతో స్వయముగాఁ బీఠము దెచ్చివైచితిని. పీఠపవిష్టుండయిన యతని యడుగులను వలదనుచుండ బలాత్కారముగాఁ గడిగి యుత్తరీయాంశుకముచేఁ దడియొత్తి యతనికిఁ దాపుగాఁ గూర్చుంటిని.

అతం డట్లొక మూహుర్తమాత్రము విశ్రమించి యెద్దియో చెప్పఁదలచుకొని నాదాపుననున్న తరళికపై దృష్టి నెఱయించెను దాన నతని యభిప్రాయము గ్రహించి దేవా! యిది నా శరీరము వంటిది. వక్తవ్యాంశము నిస్సంశయముగాఁ జెప్పవచ్చునని పలుకగాఁ గపింజలుఁ డిట్లనియె.

రాజపుత్రీ! నేనేమని చెప్పుదును? సిగ్గుచేత నా వాక్కు వక్తవ్యాంశమును గ్రహింపకున్నది కందమూలములం దినుచు శాంతముగా నడవులఁ గ్రుమ్మరు మునిజన మేడ? మన్మథవిలాసము లేడ? అంతయు విపరీతముగానే యున్నది. దైవమెట్లు చేయుటకు సంకల్పించెనో చూడుము. భగవంతుఁ డప్రయత్నముచేతనే పురుషునిఁ బరిహాసాస్పదముగాఁ జేయునుకదా! ఇది యే ధర్మోపదేశమో నాకుఁ దెలియకున్నది. నా సందేశము చెప్పక తప్పదు. మఱియొక యుపాయ మేదియు గనంబడుకున్నది. కొండొకప్రతిక్రియయుఁ దోచదు. ప్రాణపరిత్యాగముచేత నయినను మిత్రుని రక్షింపఁదగినదని చెప్పుచున్నాను. వినుము. నీ దాపుననే నిష్ఠురముగా నట్లు కోపపడి యట నుండక పుష్పములు కోయుటమాని మఱియొక చోటికిం బోయితిని. పిమ్మట నీవు నింటికిఁ బోయితివి కదా! అప్పుడు నే నితండొక్కడు నేమిచేయుచున్నవాఁడో చూతమని మరలివచ్చి యచ్చటి కొమ్మల సందున దాగి యా ప్రదేశమును జూచితిని కాని యతండందు గనంబడలేదు.

మే మిరువురము పుట్టిననాటనుండియు నొకక్షణమైన నెడఁబాసి యుండ లేదు. కావున సుహృత్స్నేహతరత్వంబున హృదయంబు దొట్రుపడుచుండ నిట్లు తలంచితిని.

అయ్యో! నా మిత్రుడు మదనపరాయత్తచిత్తుండై యామత్తకాశినివెంటఁ బోయి తిరిగి నా యొద్దకు వచ్చుటకు సిగ్గుపడియెఁ గాఁబోలు, లేక కోపముచేత నన్ను విడిచి యెచ్చటికేనిం బోయెనేమో! ధైర్యస్ఖలనవిలక్షణుఁడైన యతం డేమై పోయెనో కదా యని యమంగళము తలంచుకొనుచుఁ దరులతాగహనములు, చందనవీథులు, లతామంటపములు, సరఃకూలములు మొదలగు ప్రదేశములు పెద్దతడవు తద్దయు శ్రద్ధతో వెదకితిని.

అంత నొక సరస్సమీపమందు లతామంటపమున చిత్తరువు మాడ్కి, స్తంభితుని పగిది యోగస్థునిభంగి గదలక మన్మథశాపభయంబున బోలె నడఁగి నిష్పందనిమీలితమగు కనుదోయినుండి బాష్పజలము ధారగా వెడలుచుండ హృదయమునఁ బ్రజ్వరిల్లు మదనాగ్నిజ్వాలను గైకొని వెడలు నిట్టూర్పుగాడ్పులచేఁ బ్రాంత