పుట:కాశీమజిలీకథలు-05.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

267

నెద్దియో వ్రాసి, కనకగాత్రీ! నీ వీపత్రికం గొనిపోయి యా రాజపుత్రి కేకాంతముగా నున్నప్పుడిమ్ము. పొమ్మని పలుకుచు నది నా కిచ్చెను. నేనును దాని బదిలముగా దెచ్చితి నిదిగో చూడుమని తాంబూలభాజనమునుండి యా పత్రికం దీసి నా కందిచ్చినది.

నేనును దత్సంభాషణముల చేతనే మేన రోమోద్గమము జనింప నతనముట్టినట్లు సంతసించుచు నా పత్రిక నందుకొని తల్లిఖితాక్షరంబులం జూచి కన్నుల నద్దికొనుచు మదనావేశముతో నిట్లు పఠించితిని.

[1]ఉ. తామరతూడువోలె విశదంబగు ముత్తెపుపేరుచేత నా
    హా! మహి లోభ పెట్టబడు హంసవిధంబున నాశఁజెంద నెం
    తో మదుదారమానససముద్భవభూరితరాభిలాష నీ
    చే మహిళావతంసమ? రుచిం గొనిపోఁబడెజూవెఁ దవ్వుగాన్.

అట్టి పద్యము జదివించినంత నాలుకగోసిన మూగవానివలెఁ గల్లుద్రావిన యున్మత్తునపగిది స్మరాతురమగు నా హృదయము ప్రవాహము చేత వ్యాకులమయిన సరిత్తువలె విహ్వలత్వము గైకొనినది.

మరియు, నా పత్రికం జూచుటచే, ద్రిలోకరాజ్యవైభవ మనుభవించినట్లు సంతసించుచు దానిఁ గపోలములయందును అలకలయందును బెట్టుకొనుచుఁ దరళికా! చెప్పుము. చెప్పుము. అతండు నీచే నెట్లు చూడబడియెను? ఏమేమి చెప్పెను? నీ యొద్ద నెంతసేపు నివసించెను? అని పలుమారు దాని నడుగుచు నెట్టకేలకు నా దివసము గడిపితిని.

పిమ్మట నా హృదయముతోఁ గూడ సూర్యబింబము కృతరాగసంవిభాగము కలదియై యొప్పినది. అప్పుడు ఛత్రగాహిణి వచ్చి, రాజపుత్రీ! అమ్మునికుమారులలో నొఁకడు వచ్చి ద్వారమున నిలిచి జపమాలిక నడుగుటకు వచ్చియున్నానని చెప్పుచున్నాడు. అనుజ్ఞయేమని యడుగగా నేను మునికుమారనామగ్రహణముచే మిగులఁ దొందరపడుచు నతనిరాక శంకించుకొనుచు వేగమ తీసికొనిరమ్మని యాజ్ఞాపించితిని.

అమ్మునికుమారుని వయస్యుఁడయిన కపింజ్జలుని నది వోయి తీసికొని వచ్చినది అతని యాకారముఁజూడ విషాదముతోఁ గూడినట్లు కనఁబడినది. అప్పుడు

  1. శ్లో॥ దూరంముక్తాలతయా బిససితయాప్రలోభ్యమానోమె
         హంసఇవదర్శితాశో మానసజన్మా త్యయానీతః.

    తా. ముత్తెపుపేరును చూచి తామరతూడనుకొని యాసతో దూరముగాఁ బోయిన హంసవలెనే నీ చేత నా మనోరథము దవ్వుగా దీసికొని పోబడినదని తాత్పర్యము.