పుట:కాశీమజిలీకథలు-05.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

కాశీమజిలీకథలు - ఐదవభాగము

జెప్పుకొందును? దీనికిఁ బ్రతీకారమెద్ది? అని పెక్కుతెరంగుల నున్మత్తవలెఁ బలవరించుచు నంతఃపురమున కితరుల రాకుండ నియమించి యొంటిగా నొకగవాక్షము దాపునఁ గూర్చుండి ఆ దిక్కునే మిక్కుటమయిన దానిగాఁ దలంచుచు నా దిశనుండి గాలివచ్చినను మనోహరమయిన దానిగాఁ నెంచుచు మౌనమవలంబించి యాతని రూపమును, లావణ్యమును, యౌవనమును మాటిమాటికి స్మరించుకొనుచు మేనం బులకలు బొడమ, దత్కరతం స్పర్శసుఖం బభినయించుకొనుచు క్షణమొక యుగములాగున గడుపుచుంటిని.

అంతలో తాంబూలకరండవాహిని తరళిక యననది నా యొద్దకు వచ్చి నా యవస్థ యంతయుంజూచి చింతించుచు నిట్లనియె.

రాజపుత్రీ! అత్తటాకమునుండి స్నానముఁజేసి నీవు నన్నుఁ బరామర్శింపక ముందుగా నింటికి వచ్చితివి కదా! నీవు వచ్చిన తరువాత నొకవిశేషము జరిగినది, యాకర్ణింపుము. దివ్యాకారములతో నిరువురు మునికుమారులు అచ్ఛోదసరస్తీరంబున మనకుఁ గనఁబడిరి కదా? వారిలో నీ కీపుష్పమంజరి నిచ్చిన యతండు రెండవవానికి గనంబడకుండఁ బుష్పించిన లతావితానముల మాటుగా నా యొద్దకు వచ్చి, బాలికా! యిప్పుడిక్కడ స్నానము చేసిన కన్యక యెవ్వని కూతురు? పేరేమి?యెచ్చటికిఁ బోయినదని నన్నడిగెను.

అప్పుడు నేను వినయములతో ఆర్యా! యీ చిన్నది హంసుఁడను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మహాశ్వేత యిప్పుడాత్మీయనివాసస్థానమైన హేమకూటమను పర్వతమునకుఁ బోయినదని చెప్పితిని.

నా మాట విని యతండు ముహూర్తకాల మూరకొని యెద్దియో ధ్యానించుచు దేనినో యాచించువాఁడుంబలె రెప్ప వాల్పక నన్నుఁ జూచుచు సానునయముగా వెండియు నా కిట్లనియె.

కల్యాణీ! నీవు చిన్నదానవైనను నీ రూపము నీ గౌరవమును, యోగ్యతను వెల్లడిచేయుచున్నది. నిన్నొండు యాచించుచున్నవాఁడ, కాదనక యాచరింతువే యనుటయు నేను వినయముతో నంజలి ఘటింపుచు మెల్లన నిట్లంటి.

మహాభాగ! మీ రట్లు పలుకుటకు నేనెవ్వతెను. త్రిభువనపూజనీయులగు మీ వంటి మహాత్ములు పూర్వపుణ్యవశంబునంగాక మా యట్టి కృతులయందు దృష్టి ప్రభావమైనఁ బరగింపరనుచో నాజ్ఞాపించుమాటఁ జెప్పనేల? దాసురాలయెడఁ గనికరముం చేయఁదగిన కార్య మెద్దియో చెప్పుఁడు. నమ్మకముగాఁ జేసి యనుగ్రహపాత్రురాల నగుదునని పలికితిని.

అప్పుడు నన్నతండు సఖురాలిగా మన్నించుచు సంతసముతో నా ప్రాంత మందున్న తమాలతరుపల్లవమును దెచ్చి తీరప్రస్తరముపై వైచి నలిపి రసముదీసి యా రసమున వల్కలోత్తరీయ మింత జించి దానియందు కనిష్టికానఖశిఖరముతో