పుట:కాశీమజిలీకథలు-05.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

263

నిగళమై తగులుకొని కదలనీయమింజేసి మునిజాతి యశేషజనపూజనీయమయినదికదా? నమస్కరించి యరిగెద, దీనం దప్పేమియని యప్పుడే దాపునకుఁబోయి అతని మొగమునందు చూపులిడుచు బాదంబులకు నమస్కరించితిని.

దుర్లంఘ్యశాసనుండగు మదనుం డప్పుడు మద్వికారదర్శనంబున నపహృతధైర్యుఁ డగు నతని హృదయమునుగూడ విపనుండు దీపమువలెనే చాంచల్య మందఁజేసెను.

యౌవనము అనినయబహుళమైనది కదా! అప్పు డతనికి గ్రొత్తగాఁ జిత్తమును జొచ్చుచున్న మదనుని నెదుర్కొనుచున్నట్లు రోమాంచము పొడమినది నా యొద్దకు వచ్చుచున్న హృదయమునకు దారిజూపుచున్నట్లు నిట్టూర్పులు వెడలినవి. వ్రతభంగమున భయపడుచున్నదివోలె గరతలమందున్న జపమాలిక జారిపడినది.

అప్పుడు నేనతని వికారమును జూచి హృదయంబున మదనావేశము రెట్టింప నిట్టిదని చెప్పుటకు నలవికాని యవస్థం జెందుచు డెందమున నిట్లు తలంచితిని.

అనేకసురతలాస్యలీలావిశేషముల నుపదేశింప నుపాధ్యాయుండగు మన్మథుండే విలాసములను నేర్పునుగదా! లేనిచో శృంగారచేష్టలయందుఁ బ్రవేశింపని బుద్ధిగల యీమునికుమారుని దృష్టిప్రసార మింత మనోహరముగా నెట్లుండును.

ఈతని హృదయాభిలాషనంతయు నతని చూపులే చెప్పుచున్నవి. అని తలంచుచు దాపుగాఁబోయి యతని సహచరుండగు ఱెండవ మునికుమారునితోఁ బ్రణామపూర్వకముగా నిట్లంటిని.

ఆర్యా! యీ మునికుమారుని పేరేమి? యెవ్వని కుమారుండు? ఈయన శ్రవణాభరణముగా ధరించిన పుష్పమంజరి యేకుంజమునఁ బుట్టినది? దీని సౌరభ మాఘ్రాణించినది మొదలు నాహృదయ మెంతేని సంతస మందుచున్నది. ఇట్టి సుమ మెన్నడను జూచియుండలేదని పలుకగా విని యమ్మునికుమారుం డించుక నవ్వుచు నాకిట్లనియె

బాలా! నీ ప్రశ్నముతోఁ బ్రయోజనమేల? కౌతుకమేని వక్కాణించెద వినుము.

పుండరీకుని కథ

దేవలోకంబున శ్వేతకేతుఁడను మహాముని కలఁడు. అతని యాకారము త్రిభువనసుందరమైనది. అమ్మహాముని యొకనాఁడు దేవతార్చనకు సుమములఁ గోయుటకు మందాకినీనదికిఁ బోయెను. అందు బద్మములు గోయుచున్న యమ్మునిపుంగవునిం జూచినంత పద్మసన్నిహితయైన లక్ష్మికిఁ జిత్తచాంచల్యమైనది.

ఆలోకమాత్రంబుననే సురతసమాగమసుఖ బనుభవించిన యమ్మహాదేవికిఁ బీఠంబుగానున్న యప్పద్మంబునంద కుమారుం డుదయించెను.