పుట:కాశీమజిలీకథలు-05.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

కాశీమజిలీకథలు - ఐదవభాగము

చెదను. కానిచో నతనికి సమానవస్తుసృష్టితో నేమి ప్రయోజనమున్నది. బహుళపక్షక్షపాకరుని కిరణములకు దరణుండు హరించుచున్నవాఁ డనుమాట యళీకము ఇమ్మునికుమారుని శరీరమందే యణంగుచున్నవి. కానిచోఁ గ్లేశబహుళమగు తపంబున నొప్పుచున్నను వీనిమే నింత లావణ్యభూయిష్టమై యుండనేల?

అని ఇట్లు విచారించుచున్న నన్ను రూపైకపక్షపాతి యగు కుసుమశరుఁడు బరవశనుఁగా జేసెను.

నిట్టూర్పులతోఁగూడఁ గుడికన్నించుక మూసి తిర్యగ్దృష్టిచే నతనిరూపము పానము చేయుదానివలె నెద్దియో యాచించుదానివలె నీదాననైతినని పలుకునట్లు హృదయ మర్పించుపగిది మనోభవాభిభూతురాలనగు నన్ను రక్షించుమని శరణుజొచ్చుమాట్కి నీ హృదయంబు నాకవకాశ మిమ్మని కోరుతీరునఁ జూచుచు అన్నన్నా! ఇది యేమి మోసము కులస్త్రీ విరుద్ధమగు బుద్ధిపుట్టినది ఇది గర్హితమని యెఱింగిన దాననైనను నింద్రియప్రవృత్తుల మరలించుకొన వశముకాక స్థంభింపఁబడినట్లు వ్రాయబడినట్లు మూర్ఛబొందిన చందమున నవయవములు కదల్పలేక యట్టె నిలువంబడితిని. అప్పటి నాయవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముకాదు. పూర్వము శిక్షింపబడినదికాదు.

తద్రూపసంపత్తుచేతనో మనస్సుచేతనో మన్మథుని చేతనో యౌవనము చేతనో యనురాగముచేతనో దేనిజేతను జేర్పబడితినో కాని యట్టియవస్థ నేనెన్నఁడు నెఱుంగను.

అట్లు పెద్దతడవుచూచి యెట్టకేలకుఁ జిత్తమును దృఢపరచుకొంటిని అప్పు డతని హృదయమున నిల్చుట కవకాశ మిచ్చుటకుఁ గాబోలు నిశ్వాసమారుతములు బయలువెడలినవి. హృదయాభిలాష దెలుపుచున్నదివోలె గుచయుగళము గగుర్పొడిచినది. సిబ్బితిం గరుగుచున్నట్లు మేనెల్ల జమ్మటలు గ్రమ్మినవి. మదనశరపాతభయంబునఁబోలె గంపము వొడమినది. అట్టి సమయమున మనంబున నేనిట్లు తలంచితిని.

అయ్యయ్యో! సురతవ్యతిరేకస్వభాండును మహానుభావుండునగు నిమ్మునికుమారునియందు దుర్మదుండగు మన్మథుండు నాకిట్టి యనురాగము గలుగఁజేయుచున్నవాఁడేమి? అనురాగము విషయయోగ్యత్వమును విచారింపదు, స్త్రీహృదయం బెంత మూఢమైనదో కదా! ప్రాకృతజనులచేఁ బొగడఁబడుచుండెడు మన్మథవిలాసము లెక్కడ? తపోమహత్వ మెక్కడ? మన్మథవికారములచేఁ దొట్రుపడుచున్న నన్నుఁ జూచి యీతండు చిత్తంబున నెట్లు తలంచునో? అట్లెఱింగియు నీ వికారమణగింప లేకున్నదాన నెంతచిత్రమో? ఇది మదీయచిత్తదోషముకాదు తదీయరూపవిశేషమం దట్టి మహిమ యున్నది ఈతఁడు నా వికారములఁ జూడకమున్న ఇందుండి లేచిపోవుట యుక్తము. అప్రియములగు స్మరవికారములఁ జూచి కోపముతో శాపమిచ్చునేమో! మునిస్వభావము పరిభవమును సహింపదుగదా.

అని మరలిపోవుటకు నిశ్చయించియు నతని యాకృతివిశేషము పదములకు