పుట:కాశీమజిలీకథలు-05.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

259

క్షణ మూరకొని పిమ్మట నతని నాగమనకారణం బడుగుటయు నారాజపుత్రుఁడా పద్మనేత్రకు తాను దిగ్విజయయాత్రకు వెడలినది మొదలు కిన్నరమిథునానుసరణముగా వచ్చి యచ్చిగురుబోడిం జూచువరకు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పెను.

అతని వృత్తాంత మంతయును విని యాజవ్వని సంతసించుచు భిక్షాకపాలమును గైకొని యవ్వనతరువులయొద్దకుఁ బోయెను.

అప్పుడు స్వయంపతితములైన ఫలములచే నా పాత్ర నిండినది. వానిం గొనివచ్చి యిచ్చినది యుపయోగింపుఁడని చంద్రాపీడు నొద్ద నుంచినది.

ఆ చిత్రమంతయుం జూచి యతండు తలయూచుచు అన్నన్నా! తపంబున కసాధ్యమైనది లేదుగదా? అచేతనమునగు నీవృక్షములుగూడ నీమె దయనుఁ గోరుచున్నవిపోలె వినమ్రతతో ఫలముల నిచ్చినవి. ఆహా! ఇంతకన్న నబ్బుర మెద్ది అదృష్టపూర్వములగు నాశ్చర్యములం గంటినని మిగుల విస్మయము జెందుచు లేచి యచ్చటి కింద్రాయుధమును దీసికొనివచ్చి యనతిదూరమునఁ గట్టి యందున్న నిర్ఝరజలంబున స్నానము జేసి యమృతరసమధురములగు నా ఫలముల దిని చల్లని నీరు గ్రోలి నాయువతిగూడ ఫలహారము చేసివచ్చువరకు నేకాంతప్రదేశమునం గూర్చుండెను.

నిత్యక్రియాలాపములు దీర్చుకొని ఫలరసముల ననుభవించి యాయించుబోడియు నొకశిలాతలంబునం గూర్చుండునంత నాప్రాంతమునకుఁ బోయి చంద్రాపీడుఁడు ననతిదూరంబునం గూర్చుండి యతివినయముతో నిట్లనియె.

భగవతీ! భగవదనుగ్రహప్రాప్తిప్రేరకమైన సంతోషముచేతఁ దొట్రు పడుచు మానుషసులభమైన లాఘవము నన్ను నిచ్చలేకున్నను బ్రశ్నకర్మకుఁ బ్రోత్సాహపరచుచున్నది. ప్రభువుల యనుగ్రహలేశము గూడ నధీరులకుఁ బ్రాగల్భ్యము గలుఁగఁజేయును. సహవాసము కొంచమైననుఁ బరిచయమును గలుగజేయక మానదు. ఉపచారపరిగ్రహ మల్పమైనను ప్రణయ మారోపించును. నీకు ఖేదకరము కాదేని నాయడుగు ప్రశ్నమున కుత్తర మియ్య వేడెదను. నిన్నుఁ జూచినది మొదలు నాకీ విషయమై మిగుల కౌతకము గలిగియున్నది. సురముని గంధర్వ గుహ్యకాదులలో నీజన్మము చేత నెవ్వారి కులము పావనమైనది? కుసుమకోమలమగు నీవయసున నిట్టి కఠినవ్రత మేమిటికిఁ బూనితివి? అన్నన్నా! ఈప్రాయమేడ? యీయాకారమేడ? యీలావణ్యమేడ? యీతపమేడ? నాకు మిక్కిలి యక్కజముగా నున్నది?

సురలోకసౌఖ్యములు గల యాశ్రమములను విడిచి నిర్జనమగు నీ యడవిలో నొంటిగా నేమిటికి వసించితివి? యిట్టి చిత్రములు నే నెచ్చటను జూచియుండ లేదు. నీ వృత్తాంత మంతయు నెరిఁగించి నా సందియమును దీర్చుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్ధించెను.

అతని మాటలు విని యవ్వనిత యెద్దియో హృదయంబున ధ్యానించి