పుట:కాశీమజిలీకథలు-05.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ముహూర్తకాల మూరకొని నిట్టూర్పులు నిగిడింపుచు ముక్తాఫలంబు బోలిన యశ్రుజలబిందువులు నేత్రకోణంబులనుండి వెల్వడి స్తనవల్కలమునుఁ దడియఁజేయఁ గన్నులు మూసికొని వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.

అట్లకారణముగా విచారింపుచున్న యాయన్నుమిన్నం జూచి వెరగందుచు నతఁ డాత్మగతంబున నిట్లు తలంచెను. అన్నన్నా! వ్యసననిపాతములు దుర్నివారము లైనవిగదా? మనోహరమగు నిటువంటి యాకృతులను సైతము దమవశముఁ జేసికొనుచున్నయవి. శరీరధర్మము గలవారి నుపతాపము లంటక మానవు. సుఖదుఃఖములయొక్క ప్రవృత్తి బలమైనది ఈమె గన్నీరు గార్చుటచే నేతత్కారణ మరయ నాకు మరియుఁ గుతూహల మగుచున్నది. అల్పకారణంబున నిట్టివారు శోకింపరు. క్షుద్రనిర్ఘాతపాతంబున భూమి గదులునా? అని యిట్లు తద్విధం బరయ దలంచి మదీయశోకస్మరణమునకుఁ దానే కారణమని భయపడుచు లేచి యంజలిచేఁ బ్రస్రవణోదకముదెచ్చి మొగము గడిగికొమ్మని యమ్మగువ కందిచ్చెను.

అయ్యింతి సంతతముగాఁ గారుచున్న యశ్రుధారలచేఁ గలుషములగు నేత్రముల నాయుదకంబునఁ గడిగికొని వల్కలోపాంతముచే నద్దుకొనుచుఁ నుష్ణముగా నిట్టూర్పులు నిగిడించుచు నతని కిట్లనియె.

రాజపుత్రా! మందభాగ్యురాల నావృత్తాంతముతో నీకేమి లాభమున్నది! అయినను వేడుకపడుచుంటివి కావునఁ జెప్పెద నాకర్ణింపుము.

మహాశ్వేతకథ

దక్షునిప్రసిద్ధి నీవు వినియేయుందువు. అతనికి మనియు, నరిష్టయనియు నిరువురు పుత్రికలు జనించిరి. అందు మనికిఁ జిత్రరథుండను కుమారుం డుదయించెను. ఆ చిత్రరథుండు సమస్తగంధర్వులకు నధినాయకుండై యింద్రునితో మైత్రి సంపాదించి యీశ్వరప్రసాదంబున మనోహరముగా నిందు చైత్రరథమను పేర నీయుద్యానవనమును అచ్చోదమను నీ సరస్సును నిర్మించెను.

అరిష్టకొడుకు హంసుడనువాఁడును ద్వితీయగంధర్వకులమునకుఁ బ్రభువగుచు గౌరి యను కన్యకను జంద్రకిరణములం బుట్టినదానినిం బెండ్లియాడి యా కాంతామణితో సంసారసుఖము లనుభవింపుచుండెను.

ఆ దంపతులకు సమస్తదుఃఖములకు భాజనమైన నొక్కరితను పుత్రికగా నుదయించితిని. నాతండ్రియు ననపత్యుఁడగుటచే నప్పుడు సుతజన్మాతిరిక్తమగు నుత్సవమును జేయుచు మిక్కిలి సంతోషించుచు జాతకకర్మానంతరమునందు నాకు మహాశ్వేత యని పేరుబెట్టెను.

నేను బిత్రుగేహంబును మధురములగు మాటలచే బంధువులకు సంతోషము గలుగఁజేయుచు నవిదతశోకాయాసమనోహరమగు శైశవము సుఖముగా వెళ్ళించితిని.