పుట:కాశీమజిలీకథలు-05.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సిద్దజనోపస్పృష్టజలమగు సరోవరము జూడనయ్యె. తత్తీరమున విశ్రాంతి వహించియుండ నమానుషగీతము విననయ్యె. దాని ననుసరించి రాగా నిందు మానుషదర్శనదుర్లభయగు నీచిన్నది కన్నులకు విందు గావించినది.

ఇక్కురంగనయన దివ్యాంగనయని తదాకారమే చెప్పుచున్నయది. ఆహా! మనుష్యాంగనల కిట్టి సౌందర్యమును గాంధర్వమును గలిగియుండునా? దైవవశంబున నీ యోషారత్న మంతర్ధానము జెందనియెడ నీవెవ్వతెవు? నీపేరేమి? ప్రథమవయస్సున నిట్టివ్రత మేమిటికిఁ బూనితివని యడిగెదనుగదా! అని తలంచుచు నాస్ఫటికమంటపములో వేరొకస్థంభము మాటునం గూర్చుండి యానాతిగీతసమాప్త్యవసరము ప్రతీక్షించుచుండెను.

ఆ నాతియుఁ గీతావసానమున వీణంగట్టి లేచి యమ్మహాలింగమునకుఁ బ్రదక్షిణము చేయుచు నొకమూల వినమ్రుఁడై యున్న యారాజుకుమారుని నిర్మలమగు దృష్టి ప్రసారములచేతఁ బవిత్రము చేయునదివోలె మీక్షింపుచు నిట్లనియె.

అతిథికి స్వాగతమె? ఈ మహాభాగుఁ డీభూమి కేటికివచ్చెనో! అతిథిసత్కార మంద లేచి నాతో రావలసియుండునుగదా? యని పలికిన విని యచ్చంద్రాపీడుండు తత్సంభాషణమాత్రమునకే త న్ననుగ్రహించినట్లు తలంచుకొనుచు భక్తితో లేచి నమస్కరించి భగవతీ! భవదాజ్ఞానుసారంబున మెలంగువాఁడ నని వినయమునుఁ జూపుచు శిష్యుండునోలె నయ్యించుబోణి ననుగమించి నడచుచు నిట్లు తలంచెను. మేలుమేలు? నన్నుఁ జూచి యీ చిన్నది యంతర్ధానము నొందలేదు. ఇదియు మదీయహృదయాభిలాస కనుకూలించియే యున్నది తపస్విజనదుర్లభమగు దివ్యరూపముగల యీకలకంఠికి నాయెందుట్లు దాక్షిణ్యము గలుగునో యట్లు మెలంగువాఁడ. అడిగినచో దనవృత్తాంత మిత్తన్వి నాకుఁ జెప్పకమానదు, కానిమ్ము. సమయమరసి యడిగెదనని తలంచుచు నూరడుగులు అప్పడఁతి వెంట నడిచెను.

పగలైననుఁ దమాలతరుచ్ఛాయలచే రాత్రింబలె దోచు నమ్మార్గంబున నడువ మణికమండలు శంఖమయభిక్షాకపాల భస్మాలాబుకాదివస్తువులచే నొప్పుచుఁ బ్రాంతనిర్ఘరీజలకణములచేఁ జల్లనైయున్న గుహయొకటి గానంబడినది.

అయ్యిందుముఖి యచ్చంద్రాపీడుని గుహాముఖశిలయందుఁ గూర్చుండఁ గనుసన్న జేయుచు నవ్విపంచిని వల్కలతల్పశిరోభాగ మందుంచి పర్ణపుటంబున నిర్ఘరజలంబు బట్టి యర్ఘ్యముగా నిచ్చుటయు నతండు భగవతీ! చాలుచాలు అత్యాదరమును విడువుము. నీకటాక్షలేశమే మదీయపాపసముదాయముల బోగొట్టినది శిష్యు ననుగ్రహింపుమని పలుకుచున్నను విడువ కచ్చేడియ బాలాత్కారముగా నతని కతిథిసత్కారము దీర్చినది. అతండును వంచిన శిరస్సుతో నతివినయముగా నయ్యాతిథ్య మందుకొనియెను.

అట్లాతిథ్య మిచ్చి యచ్బేడియ వేరొకశిలాతలమునఁ గూర్చుండి యొక