పుట:కాశీమజిలీకథలు-05.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

257

విగతమర్త్యసంపాతముగల యీప్రదేశమునందు నిట్టి గీతధ్వని పుట్టుటకుఁ గారణమెద్దియో? యని శంకించుచు నక్కమలినీపత్రసంసరణమునుండి లేచి యతండు ఆ గీతానాదము నేతెంచినదిశకు దృష్టి ప్రసరింపఁజేసెను. ఆ ప్రదేశ మతిదూరముగా నుండుటచేఁ బ్రయత్నముచేతఁ జూచినను నేమియుఁ గనంబడినదికాదు. అనవతర మా గానస్వానము మాత్రము వినంబడుచున్నది. అప్పు డాగీతము కారణ మఱయుటకు మిక్కిలికౌతుక మందుచు నారాజకుమారుఁడు ఇంద్రాయుధము నెక్కి గీతప్రియమున ముందుగా బయలువెడలిన వనహరిణములు మార్గమును జూపుచుండ నేలాలవంగలవలీలతాలోలకుసుమభాసితములగు సప్తచ్ఛదతరువులచే మనోహరమైన తత్తటాకపశ్చిమతీరము ననుసరించి యఱిగెను.

అట్లు పోవంబోవఁ దదుత్తరతీరంబున మనోఙ్ఞతరులతావేష్టితమైన సిద్ధాయతనమొండు అతనికి నేత్రపర్వము గావించినది. స్ఫటికశిలావినిర్మితమగు నమ్మంటపమధ్యభాగంబున మందాకినీపుండరీకములచే నర్చింపఁబడిన స్ఫటికలింగ మొండు విరాజిల్లుచున్నది.

అమ్మహాలింగమునకు దక్షిణభాగంబున బ్రహ్మాసనము వైచుకొని హంస శంఖ ముక్తాఫల గజదంత పాదరసాది ధవళవస్తుజాతమును గరగించి యమృతరసముతోఁ బదును పెట్టి చంద్రకరకూర్బలచే సవరించి పోసెనోయనఁ దెల్లనిమేనికాంతి దీపింప బాలార్కప్రభాసదృశములగు జటామాలిక లుత్తమాంగమున ముడివైచికొని నక్షత్రక్షాదముఁబోని భస్మము లలాటమున మెఱయ నమలకీఫలస్థూలములగు ముక్తాఫలములచేఁ గట్టబడిన యక్షసూత్రము గంఠమునం గట్టికొని కుచమధ్యంబునం బిగియంగట్టిన కల్పతరులతావల్కలోత్తరీయము ఏకహంసమిథున సనాధయగు శ్వేతగంధం బురడింప స్వభావముచేఁ దెల్లనిదైనను బ్రహ్మాసనమం దుత్తానముగా నిడిన చరణకాంతి సంక్రమించుటచే లోహితాయమానమగు దుకూలములచేత నవృతమగు నితంబము గలిగి నఖమయూఖములు ప్రతిఫలింప దంతమయమైన వీణను దక్షిణకరంబునం బూని మూర్తీభవించిన గాంధర్వదేవతయో యనఁ దంత్రీనాదములతోఁ గంఠస్వానము మేళగించి పాడుచుఁ బాశుపతవ్రత మనుసరించి దివ్యాకృతితో నొప్పుచున్న యొకచిన్నదానిం గాంచి మేను పులకింప నానృపనందనుఁడు సంభ్రమముతో నాతురంగమును డిగ్గి యావారువమును చేరువ నొకతరుమూలమునం గట్టి యమ్మహాలింగము చెంతకుంబోయి నమస్కరించుచు నక్కాంతారత్నము ననిమేషదృష్టుల మరల నిరూపించి చూచి తదీయరూపాతిశయమునకుఁ గాంతివిశేషమునకు వెరగందుచు నిట్లు తలంచెను. అన్నన్నా! జంతువులకు నప్రయత్నముననే వృత్తాంతాంతరములు దోచుచుండునుగదా! నేను యదృచ్ఛముగా వేటకు వెడలినంత గిన్నరమిథునమునుఁ దివ్యజనసంచారయోగ్యమగు ప్రదేశమును గానంబడినది. అందు సలిలము వెదకుచుండ