పుట:కాశీమజిలీకథలు-05.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

కాశీమజిలీకథలు - ఐదవభాగము

దోచుచున్నది. ఇందు మనుష్యసంచార ముండదు. ఇది యుత్తరదేశముగావున నేను దక్షిణముగా బోయి చూచెదను. తాను జేసిన కర్మలయొక్క ఫలము యనుభవింపవలయునుగదా? అని యూహింపుచు మెల్లగాఁ దురగమును దక్షిణదిశకు మరలించెను.

అట్లు మరలించి అయ్యో! యిప్పుడు సూర్యుఁ డంబరతలమధ్యవర్తియై యున్నవాఁడు. ఈ ఘోటకమును మిక్కిలి యలసినది. యిది కొంచెము మేసినతరువాత నీరు ద్రావించి నేనును నీరు ద్రాగి యలసట దీర్చుకొని ముహూర్తకాలము విశ్రమించి పిమ్మటం బోయెదను.

అని నిశ్చయించి నీరుండుతా వరయుచుండ నొకదండ జలపక్షు లెగురుటయుం గని పట్టి యమ్మార్గంబున బోఁవబోవ మనోహరతరుషండమండితమగు నచ్ఛోదమను సరోవర మొండు గనంబడినది. చూచినంతమాత్రమున మార్గాయాసమంతయు నపనయింపఁజేసిన యక్కాసారంపుశోభం జూచి యతం డాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా? కిన్నరమిథునానుసరణము నిష్పలమైనను ఇప్పు డీసరోవరము గనఁబడుటచే సఫలమనియే తలంతును. నాకుఁ గన్నులు గలిగినందులకుఁ జూడదగినవస్తువునుఁ నేటికిఁ జూచితిని రమణీయమగుదానిలో నిది చివరిదిగా భావింతును. దీని సృష్టించిన స్రష్ట తిరుగా నమృతసర స్సేమిటికి నిర్మించెనో తెలియదు. ఇది యమృతమువలె సకలేంద్రియముల నాహ్లాదపెట్టుచున్నది. దీనిం జూచియే భగవంతుఁడగు వాసుదేవుండు జలశయనమును విడువకున్నాడు. అన్నన్నా! అమ్మహానుభావుం డిట్టిదాని విడిచి లవణరసపరుషములగు జలధిజలముల నేటికి శయనించెనో తెలియదు. నిక్కము. ప్రళయకాలమం దిందలి జలలేశము గ్రహించి మహావరాహకములు భూమినంతయు ముంచుచున్నయవి.

అని యిట్లు విచారించుచు సికతాలతావికసితమగు తదీయదక్షిణతీరమునఁ దురగమును దిగి దానినీరు ద్రాగించి యొకతరుమూలమునఁ గట్టి యత్తటాకతీరమున మొలచిన దూర్వాప్రవాళకబళములఁ గొన్ని స్వయముగాఁ బెరికితెచ్చి దానిముందు వైచెను.

తరువాత నాత డందు దిగి కరచరణముల గడిగికొని చాతకమువలె జలము గ్రోలి స్మరశరాతురుండు బోలె నళినీదళముల నురమున దాల్చుచు గొంతసే పవ్విలాస మంతయుం జూచి తలయూచి మరలఁ దీరము జేరి యందొకశిలాతలంబునఁ దూఁడులతోఁ గూడ నళినీదళంబులం గొన్ని బెరికికొనివచ్చి యాస్తరణముగా వైచి యందు శిరంబుకు జుట్టికొన్న యుత్తరీయము పరచి కూర్చుండెను.

ముహూర్తకాల మట్లు విశ్రమించినంత నాప్రాంతమున మేయుచున్న యింద్రాయుధము మేత మాని చెవులు నిక్కబెట్టుకొని యట్టెక్కి చూచుటయుఁ దత్కారణ మరయు నతనిచెవులకు వీణాతంత్రీఝుంకారమిశ్రితమగు నమానుషగీత మొండు వినంబడినది.