పుట:కాశీమజిలీకథలు-05.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

255

జటులను కిరాతులకు నివాసస్థానమై పూర్వసముద్రమున కనతిదూరములోనున్న సువర్ణపురమును జయించి స్వీకరించెను.

మరియు రాజపుత్రుఁడు ఆ నగరమందు నిఖిలధరణీతలపర్యటనమువలన నలసిన తనబలమునకు విశ్రాంతిగలుగుటకై కొన్ని దినములు వసించెను.

కిన్నర మిధునము కథ

ఆ రాజకుమారుం డొకనాఁడు ప్రాతఃకాలమున నింద్రాయుధ మెక్కి యొక్కరుఁడ విహారార్థమై యాప్రాంతారణ్యమునకుఁ బోయి యందందు సంచరించుచు దైవయోగంబున నొకచోఁ బర్వతశిఖరము నుండి దిగుచున్న కిన్నరమిథునమునుఁ జూచెను.

అపూర్వవస్తువిశేషదర్శనంబున మిగుల సంతసించుచు నతం డమ్మిథునమునుఁ బట్టుకొనఁదలంచి తురగమును మెల్లగా దాని దాపునకుఁ బోనిచ్చెను.

అప్పు డెప్పుడును జూడని పురుషునిం గనుటచే నమ్మిథునంబు వెరపు గదురఁ గాలికొలది పరువెట్టదొడంగెను.

చంద్రాపీడుండును మడమలచేఁ గొట్టుచు నత్తత్తడి వడిగాఁ బరుగిడ సేనానివేశమును విడచి యమ్మిథునమువెంట నొక్కరుండ మిక్కిలి దూరముగాఁ బోయెను.

అతని తురగ మతివేగముగాఁ బోవుచుండుటచే నమ్మిథునము దొరకునట్లే కనంబడుచు నెక్కడను జిక్కక యొక్కముహుర్తమాత్రములోఁ బదియేనామడ నడచి యతండు చూచుచుండగనే యందున్న పర్వతశిఖర మెక్కినది.

అంతవరకు నొక్కడులాగునవచ్చి యచ్చటఁ బ్రస్తరశకలము లత్తురగగమనమున కంతరాయము గలుగఁజేయ శ్రమజెంది మేనెల్లఁ జెమ్మటలుగమ్మ నడచుచున్న గుఱ్ఱమునునిలిపి తనకుఁదా నవ్వుకొనుచు నతం డాత్మగతంబున నిట్లు తలంచెను.

అన్నన్నా? పిన్నవాఁడువలె నేనీ కిన్నరమిథునము వెంటవచ్చి యూరక శ్రమపడితిని దొరికినను దొరకకున్నను దీనితో నాకేమి ప్రయోజనమున్నది బాపురే? నిరర్థకవ్యాపారమున నాకింత యాసక్తి యేల పుట్టవలయును? చేసిన కార్యము లేమైనం దీన జెడిపోపుచున్నవా? లేక మిత్రులకుఁ జేసినయుపకృతి నిలుపఁబడుచున్నదా? అయ్యారే! విచారింప దీనివెంట నే నింతదూర మెందులకు వచ్చితినో తెలియకున్నది. తలంచుకొన నాకే నవ్వువచ్చుచున్నది అయ్యయ్యో! ఇచ్చటికి నాబలమెంత దూరములో నున్నదియో తెలియదు. నాతురగము నిమిషములోఁ బెక్కుదూరము నడువ నోపును. నేను గిన్నరమిథునమంద దృష్టియిడి యతివేగముగా వచ్చుటచే నిప్పుడు తిన్నగా నేదారినిఁ బోవలయునో తెలియకున్నది. ఈ యరణ్యములో బ్రయత్నముతోఁ వెదకినను దారినెరిగించు మనుష్యుడెవ్వఁడు గనంబడకున్నాడు. యిది దేవభూమివలె