పుట:కాశీమజిలీకథలు-05.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అతిచంచలమగు రాజ్యసంపదలను జూచుకొని గర్వించుచు రాగమగ్నులై అరుదైనను ననేకసహస్రములుభాతి దోచు నింద్రియసుఖములచేత వివశత్వము నొందుదురు. ఆహా! ధనమదులు ఆసన్నమృత్యులవలె దగ్గిరనున్న బంధువులను సైతము గురుతెరుంగరు. ముఖరోగులు వలె గష్టముగా మాట్లాడుదురు. అంధులువలె దాపున నున్నవారి సైతము జూడలేరు.

జూదము వినోదమనియు, వేట పాటవమనియు, పానము విలాసమనియు, స్వదారపరితాగ్యము అవ్యసనత్వమనియు, నృత్యగీతవేశ్యాప్రసక్తి రసికతయనియు దోషములను సైతము గుణములుగా వర్ణించుచు స్వార్ధనిష్పాదనపరులు ధనపిశితగ్రాసగృధ్రులు నగు వంచకుల మాటలకు సంతసించు రాజుల శిరి యల్పకాలములో నశించును.

అమానుషోచితములగు స్తోత్రవాక్యములు విని యాత్మారోపణము చేసికొనువారు సర్వజనులకుఁ బరిహాసాస్పదు లగుదురు. కుమారా! నీ వెన్నఁడును ఇట్టి దుర్వృత్తుల జిత్తమునుఁ జొరనీయకుము. వంచకుల నంతికమునకుఁ జేరనీయకుము. సర్వదా సజ్జనగోష్ఠిని మెలంగుము. సాధులఁ దిరస్కరింపకుము. కర్ణేజపులమాటల వినకుము. పరిచారకులకుఁ జనువీయకుము. రాగలోభాదుల హృదయంబున నంటనీయకుము. అభిజాతునైనను, పండితునైనను, ధీరునైనను రాజ్యలక్ష్మి దుర్వినీతుని జేయుం గావున నీ కింత సెప్పితిని నీకు నాబోధ యేమియు నవసరములేదు. రాజ్యభారము వహింపుము. ప్రజల దయతోఁ బాలింపుమని రాజనీతి యంతయు నతని కుపదేశించెను.

అప్పుడు చంద్రాపీడుఁడు శుకనాశుని వాక్యంబువులచేతఁ బ్రక్షాళితుండు వోలె నభిసిక్తుని పగిది నభిలిపుని చందమున నలంకృతుని భాతిఁ ప్రీతహృదయుండై కొండొకవడి ధ్యానించి యతని యనుమతి నాత్మీయభవనమునకుఁ బోయెను.

అంతట దారాపీడుఁడు శుభముహుర్తమునఁ జతుస్సముద్రజలంబులం దెప్పించి బ్రాహ్మణాశీర్వాదపురస్సరముగాఁ జంద్రాపీడుని యౌవరాజ్యపట్టభద్రునిం జేసెను.

అప్పుడు ప్రజలందరు నానందసాగరమున నీదులాడిరి. చంద్రాపీడుఁడు సింహాసనమెక్కిన గొద్దిదినములకే తండ్రియనుమతి వడసి శుకనాశుని శాసనప్రకారము చతురంగవాహినీపరివృతుండై వైశంపాయనుఁడు తోడిరాఁ జిత్రలేఖతోఁగూడ దిగ్విజయయాత్ర వెడలి క్రమంబున బూర్వదక్షిణపశ్చిమోత్తరదేశములఁ దిరిగి శరణాగతుల రక్షించుచు దుర్మార్గుల శిక్షించుచు భీతుల నోదార్బుచు రాజపుత్రుల కభిషేకము జేయించుచు రత్నముల స్వీకరించుచు నుపాయనములఁ గైకొనుచుఁ బన్నులఁ దీసికొనుచు విజయచిహ్నము లాయాచోటుల స్థాపించుచు శాసనముల లిఖింపుచు బ్రాహ్మణులఁ బూజించుచు మునుల కాశ్రమములఁ గల్పించుచు బరాక్రమము వెల్లడించుచు గీర్తిని వెదజల్లుచు భూమండలమంతయు దిరిగి విజయస్థంభంబుల నాటిఁ మరలి తనపురంబున కరుదెంచుచు నొకనాఁడు కైలాససమీపమునఁ జరించెడు హేమ