పుట:కాశీమజిలీకథలు-05.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సంవాసప్రదల్భయయ్యు వినయమును విడువక రాహుగ్రాసభయంబునఁ జంద్రకిరణముల విడిచి పుడమి కవతరించిన జ్యోత్స్నయోయన లావణ్యయుక్తమగు తెల్లనిదేహకాంతి గలిగి సర్వాంగసుందరియు సకలాభరణభూషితయునై తొలిప్రాయంబున నొప్పుచున్న యా యొప్పులకుప్పం జూచి రాజపుత్రుండు వెరగుపాటుతో నీ వెవ్వండ నీబాలిక నేమిటికిఁ దీసికొనివచ్చితివని యడిగినఁ గైలాసుండు వినయముతో నమస్కరించుచు నిట్లనియె.

కుమారా! విలాసవతీ మహాదేవిగారు తమ కిట్లాజ్ఞాపించుచున్నారు. ఈ చిన్నది కులూతేశ్వరుని కూఁతురు దీనిపేరు పత్రలేఖ. మీ తండ్రిగారు దిగ్విజయము సేయుచుఁ గులూతరాజధానిం జయించి వందిజనముతోఁగూడ నీచేడియం దీసికొని వచ్చి యంతఃపురపరిచారికామధ్యంబున నుంచిరి.

నే నీబాలికామణి వృత్తాంతము విని యనాథయని జాలిగలిగి రాజపుత్రిక యని గౌరవించుచుఁ బుత్రికానిర్విశేషముగా లాలించుచు నింతదనుకఁ బెనిచితిని. ఇప్పు డిప్పడఁతి నీకుఁ దాంబూలకరండవాహినిగా నుండునని యాలోచించి యమ్మించుబోఁడి నీకడ కనిపితిని. నీ వీపూవుఁబోడిం బరిజనసామాన్యదృష్టిం జూడఁగూడదు. బాలికనువలె లాలింపవలయును. చిత్తవృత్తివలెఁ జపలక్రియలవలన మరలింపవలయును. శిష్యురాలిగాఁ జూడఁదగును. మిత్రుఁడువోలె విస్రంభకార్యములకు నియోగింపవలయును. పెనిచినమోహంబునం జేసి కన్నబిడ్డలయందువలె నాకు దీనియం దెక్కుడు మోహము గలిగియున్నది. మహారాజకులప్రసూత కావున గౌరవింప నర్హురాలు. కొలఁదిదినములలో దీని సుగుణసంపత్తి నీకే తెలియఁగలదు. దీనిశీల మెఱుఁగవు కావున నింతగాఁ చెప్పుచుంటిని.

అని చెప్పి కైలాసుఁ డూరకున్నంతఁ దనకు నమస్కరించుచున్న యా చిన్నదాని నొక్కింతతడవు ఱెప్పవాల్పక చూచి రాజపుత్రుండు, కైలాసా! అమ్మగా రె ట్లాజ్ఞాపించిరో యట్లు కావింతునని చెప్పుము, పొమ్ము. అని పలికి వాని నంపెను.

అదిమొద లమ్మదవతియు నిద్రించుచున్నను, మేల్కొన్నను, దిఱుగుచున్నను రాత్రింబగలు నీడవలె రాజపుత్రుని పార్శ్వము విడువక సేవింపుచుండెను. చంద్రాపీడుండును జిత్రలేఖం జూచినది మొద లామెయందుఁ బ్రతిక్షణము వృద్ధిజెందుచున్నప్రీతి గలవాఁడై తన హృదయముతో సమానముగ జూచుచు విస్రంభకార్యములకు నియోగింపుచుండును.

అట్లు కొన్నిదినములు గడచినంత నాభూకాంతుఁడు పుత్రకుని యౌవరాజ్యపట్టభద్రునిఁగా జేయదలంచి సంభారములన్నియు సమకూర్చుచుండెను. అప్పు డొకనాఁడు దర్శనార్ధమై వచ్చిన చంద్రాపీడునిం జూచి శుకనాశుఁడు సంతసించుచు రాజనీతి ని ట్లుపదేశించెను.