పుట:కాశీమజిలీకథలు-05.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

251

చెనే? కఠినమగు తండ్రిగారి యాజ్ఞ నీవెట్లు కావించితో తెలియదు. నీవు పిల్లవాఁడ వైనను నీ హృదయము శిశుజనక్రీడాకౌతుకలాఘవము గాదు. ఎట్లయినను గురుప్రసాదంబున సమస్తవిద్యాయుక్తుండవై చూడఁ బడితివి. ఇక ననురూపవధూయుక్తుండవగునట్లు చూడగోరుచుంటినని పలుకుచు లజ్జాస్మితావనతముఖుండైయున్న పుత్రుని చెక్కులు ముద్దుపెట్టుకొన్నది.

చంద్రాపీడుం డట్లు కొంతసేపందుండి తల్లి యానతి బూని వైశంపాయనునితోఁ గూడ నటనుండి శుకనాశుని భవనమున కరిగి యందనేక నరపతిసహస్రమధ్యవర్తి యగు శుకనాశునికి వినయముతో దూరమునుండియే యవనతమౌళియై నమస్కారము గావించెను.

అమ్మంత్రిసత్తముం డతని లేవనెత్తి యానందభాష్పపూరితనయనుండై వైశంపాయనునితోఁ గూడ గాఢాలింగనము గావించెను. రాజపుత్రుండును, మంత్రిపుత్రుండును సముచితాసనోపవిష్టులైయున్న సమయంబున నందున్న సామంతరాజులెల్లఁ దమ పీఠంబుల విడిచి నేలం గూర్చుండిరి. అప్పుడు మేనం బొడమిన పులకలచే హృదయగతహర్షప్రకర్షము వెల్లడించుచు శుకనాశుం డిట్లనియె.

తాత! చంద్రాపీడా! సమాప్తవిద్యుండవు సమరూఢయౌవనుండవు నగు నిన్నుఁ జూచుటచే నిప్పటికి మాఱేనికి భువనరాజ్యఫలప్రాప్తి గలిగినది. గురుజనాశీర్వాదము లన్నియు నిప్పటికి ఫలించినవి. అనేకజన్మోపార్జితమగు సుకృతము నేటికి పండినది. కులదేవత లిప్పటికి బ్రసన్నులైరి. పుణ్యహీనులకు మీ వంటి యుత్తములు పుత్రులుగా జన్మింతురా? నీ వయసెంత? అమానుషశక్తి యెంత? విద్యాగ్రహణసామర్ధ్య మెంత? ఆహా! ఈ దేశ ప్రజలందరు ధన్యులుగదా? ఈ భూభార మంతయు దంష్ట్రచే మహావరాహమువలెఁ దండ్రితోఁగూడ వహింపుము.

అని పలుకుచు స్వయముగాఁ గుమారకులకుఁ గుసుమాభరణాంగరాగాదు లొసంగి యాదరించెను. తరువాత నాతని యనుమతి వడసి రాజపుత్రుండు మిత్రునితో గూడ మంత్రిపత్ని మనోరమంజూచి యామె దీవెనలు నంది యటఁ గదలి తండ్రిగారిచేఁ గ్రొత్తగాఁ దమకై నిర్మింపబడిన రాజకులముయొక్క ప్రతిచ్ఛందకము వలె నున్న మేడకుం బోయెను.

మరకతమణులచేఁ దోరణములు గట్టఁబడినవి. అనేకకనకదండచిత్రపతాకము లెగురుచుండెను. తూర్యనాదము మ్రోగించిరి. మహావైభవముతో నమ్మేడఁ బ్రవేశించి చంద్రాపీడుఁడు వైశంపాయనునితోఁ గూడ వేడుకగాఁ గొన్నిదినములు గడిపెను.

మఱియొకనాఁడు కైలాసుండను కంచుకి పత్రలేఖయను నంబుజనేత్రను వెంటఁబెట్టుకుని యచ్చటికి వచ్చెను. శక్రగోపకాతుల్యమగు నరుణాంశుకము ముసుంగుగా వైచికొని బాలాతపమునఁ బ్రకాశించు తూర్పుదిక్కువలె మెఱయుచు రాజకుల