పుట:కాశీమజిలీకథలు-05.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

249

ఓసీ! వేగముగాఁ బరిగిడుచుంటివి. నేనుగూడ వచ్చెదఁ గొంచెము నిలువుము.

ఆహా! నీ మొహము! రాజపుత్రుం జూచినతోడనే యున్మత్తురాలవై పోయితివే? యుత్తరీయము స్వీకరింపుము.

చపలురాలా! మోముదమ్మిం గ్రమ్ముచున్న యలకమ్ముల ముడిచికొని మరియుం జూడుము.

మూఢురాలా! శిరముపై చంద్రలేఖ వ్రేలాడుచున్నది. సవరించుకొనుము! జవ్వనీ! ఏమి నీ యౌవనమదము నన్ను నొక్కి స్రుక్కఁ జేయుచుంటివి. వెనుకకు జరుగుము.

సిగ్గులేనిదానా! కట్టిన దుకూలము జారుచున్నది చూచుకొమ్ము.

మత్సరురాలా! ఎంత సేపు చూచెదవు? నీకుకాని యితరులకు వేడుక లేదనుకొంటివి కాబోలు! తొలగి నాకుఁ జోటిమ్ము.

అమ్మా! కాణాచివి. నీవే ముందరకు రమ్ము.

నీవొక్కరితవే గవాక్ష మరికట్టితి వెట్లు?

ఓహోహో! నీ మిథ్యావనీతత్వ మెరింగితినిలే. ఈ వారచూపువేల? విస్రబ్దముగాఁ జూడుము.

ముగ్ధురాలా! మదనజ్వరపులకజాలము మేనం బొడమినది. కప్పికొనుము.

అనంగపరవశురాలా! నాకట్టిన వస్త్రము నుత్తరీయముగాఁ బూనుచుంటివి విడువుము?

శూన్యహృదయురాలా! నీవిప్పు డెక్కడ నుంటివో తెలిసికొన లేకుంటివే?

అత్తగారు చూచి యాక్షేపించుననియా? పరుగిడి లోపలికి బోవుచుంటివి?

లఘుమతీ! రాజపుత్రుం డవ్వలకు బోయెఁ గన్నులం దెరువుము.

ఓహో! పతివ్రతాశిరోమణీ! చూడఁదగిన వస్తువుల జూడక నీ కన్నుల వంచించుచుంటివి గదా!

ప్రియసఖీ! పరపురుషదర్శనపరీహారవ్రతము విడిచి త్రిలోకమోహజనకుండు రతివిహితుండు నగృహీతమకరధ్వజుండు నగు నీమకరధ్వజు నీక్షింపుము. ధన్యురాల వగుదువు.

ఆహా! ఆ మోము అయ్యారే? ఆ తళ్కుజెక్కులు, బాపురే? ఆ బాహువులుఁ భళిరే! పేరురంబు. ఈ సుకుమారుని బుత్రునిగాఁ గనిన విలాసవతి యెంత